Anantapur District : ఓఎంసీ ప్లాంట్ లో చోరీలు.. ఐదుగురు అరెస్ట్

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి.హీరేహల్ మండలం లోని ఓఎంసీ ప్లాంట్ లో వాహనాలకు చెందిన వస్తువులు చోరీ చేస్తుండగా, బుధవారం 5.30 గంటల ప్రాంతంలో ఐదు మంది దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారైనట్లు తెలిసింది. 2009లో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీ మైనింగ్ కంపెనీలో సిబిఐ సీజ్ చేసిన మొబైల్ క్రషర్, హిటాచిలు, వివిధ మైనింగ్ వాహనాలను గ్యాస్ కట్టర్లు ఉపయోగించి ఇనుప సామాగ్రిని కట్ చేస్తుండగా, పశువులు, మేకల కాపర్లు డి.హిరేహాల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఓఎంసీ ప్లాంట్ లోకి వెళ్లి గ్యాస్ కట్టర్లతో వాహనాలను కట్ చేస్తుండగా, దొంగలను పట్టుకున్నారు. వారితో పాటు ఒక మినీ లారీ, గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్లు, ఇనుప సామగ్రిని కోసే యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓఎంసి ప్లాంట్ లో చోరీకి పాల్పడిన ఐదు మంది దొంగలను పోలీసులు పట్టుకొని రాయదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరో ఇద్దరు అడవిలోకి పరారయ్యారు. వారంతా కర్ణాటకలోని విజయనగరం జిల్లాకు చెందినవారుగా తెలిసింది. గత మూడు రోజులగా ఓఎంసీ ప్లాంట్ నుంచి చోరీ చేసిన వస్తువులు కర్ణాటకకు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దొంగలను రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ నేతృత్వంలో పోలీసులు విచారిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com