Krishna District : టమాటా రేట్లు పెరగడంతో మొదలైన దొంగతనాలు..!

Krishna District : ప్రస్తుతానికి దేశంలో ఖరీదైన వస్తువు ఏదైనా ఉందంటే అది టమాటే. మార్కెట్లో టమాటా కొనాలంటే ఏదో బంగారం కొంటున్నంత పనైపోతోంది. రేట్లకు భయపడి చాలామంది టమాట కొనడమే మానేశారు. ఇక పెరిగిన రేట్లతో టమాటా దొంగతనాలు కూడా మొదలయ్యాయి. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో టమాటా దొంగతనం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు 3 టమాటా ట్రేలను లేపేశారు. దీంతో వేలల్లో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.
పెనుగంచిప్రోలు సత్రం సెంటర్లోని కూరగాయల మార్కెట్లో ఈ దొంగతనం జరిగింది. వ్యాపారస్థులు సాయంత్రం కొట్టు మూసేసి ఇంటికెళ్లారు. ఇంకేముందు దొంగలకన్ను టమాటాలపై పడింది. రాత్రి టైం చూసుకుని 3 ట్రేలు లేపేశారు. ఒక్కో టమాటా ట్రే ధర 2వేల పైనే నడుస్తోంది. 6వేల రూపాయల టమాటాలు మాయమవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు.
దేశమంతా టమాటా రేటు మంటపుట్టిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో సెంచరీ కొట్టేసింది. కొన్నిరాష్ట్రాల్లో కేజీ టమాటా 150 దాటింది. తెలుగురాష్ట్రాల్లోనూ 140వరకు రేటు నడుస్తోంది. ఆసియాలోనే అతిపెద్దదైన మదనపల్లి హోల్ సెల్ మార్కెట్లోనే కేజీ 156 దాటిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, ఏపీలోనే ఎక్కువగా టమాట సాగు జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో.... రేట్లు జెట్ స్పీడులా దూసుకెళ్లాయి.
ఇప్పట్లో టమాటా రేట్లు తగ్గే సూచనలే కనిపించడం లేదు. కేజీ 200 అయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు వ్యాపారస్థులు. పెరిగిన టమాటా రేట్లు జనాన్ని పరేషాన్ చేస్తున్నాయి. దొంగతనం చేసే వరకు పరిస్థితి వచ్చిందంటే టమాట మంట ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com