Mahbubnagar : దారుణం.. 21 కుక్కలకు విషం ఇచ్చి చంపేశారు!

వీధి కుక్కల బతుకు దారుణంగా తెల్లారిపోయింది. కుక్కల బెడద తప్పించుకునేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నప్పటికీ ఆ గ్రామంలోని వారు మాత్రం కర్కశంగా ప్రవర్తించారు. తెలంగాణలోని (Telangana) మహబూబ్‌నగర్ జిల్లాలో (Mahbubnagar District) దారుణ ఘటన చోటు చేసుకుంది.
అడ్డాకుల పొన్నకల్‌లో దారుణ సంఘటన రాష్ట్రమంతటా సంచలనం రేపుతోంది. 21 వీధి కుక్కలను చంపేశారు గుర్తుతెలియని వ్యక్తులు. వీటితో పాటు.. ఇతర అనేక కుక్కలు గాయపడినట్లు గుర్తించారు. జాతీయ రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో వీధి కుక్క అనేదే లేకుండా చేశారు ఆ కిల్లర్లు. మాస్కులు వేసుకొని గ్రామంలోకి ప్రవేశించి 20 కుక్కలను చంపేశారని గ్రామంలోని వారు చెబుతున్నారు.
జంతు హింస చట్టం, ఆయుధాల చట్టం కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఖాళీ కాట్రిడ్జ్‌లను గుర్తించిన పోలీసులు క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపారు. నాటు తుపాకులతో కొన్నింటికి కాల్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరికొన్ని కుక్కలకు బులెట్ గాయాలు లేవు. విషం పెట్టి కొన్నింటిని... విషం పెట్టిన తర్వాత ఎగబడ్డ కొన్నింటిని కాల్చి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన కుక్కలకు పశుసంవర్ధక శాఖ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. శవపరీక్ష తర్వాత కుక్కలను ఖననం చేశారు.
గ్రామంలో సీసీ కెమెరాలు లేవనీ.. రోడ్లపైనా లేకపోవడంతో నిందితుల గుర్తింపు కష్టమవుతోందని చెప్పారు. ఇప్పుడు కెమెరాలను అమర్చమని గ్రామ సర్పంచ్ కు సూచించామన్నారు అడ్డాకుల ఎస్‌ఐ శ్రీనివాస్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com