Indian Student Murder : ఘోరం.. ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థి హత్య
ఆస్ట్రేలియాలో కొందరు భారతీయ విద్యార్థుల మధ్య ఘర్షణలో హర్యానాలోని కర్నాలకు చెందిన 22 ఏళ్ల ఎంటెక్ విద్యార్థి చనిపోయాడు. ఈ ఘటన మెల్బోర్న్ శనివారం రాత్రి 9 గంటలకు చోటు చేసుకుందని మృతుని బంధువులు తెలిపారు.
ఇదే ఘర్షణలో మరో విద్యార్థి కూడా గాయపడ్డాడని చెప్పారు. ఇంటి అద్దె విషయంలో కొందరు భారతీయ విద్యార్థుల మధ్య ఘర్షణను నివారించేందుకు నవీత్ సంధు ప్రయత్నించిన సమయంలో మరో విద్యార్థి అతడి పై కత్తితో దాడి చేశాడని మృతుని బంధువు యశ్వీర్ చెప్పారు. నవీత్ కు కారు ఉండటంతో తన సామాన్లు తీసుకుని వచ్చేందుకు సహకరించాలని కోరాడని ఆయన తెలిపారు. తన స్నేహితుడు లోపలికి వెళ్లిన తర్వాత కాసేపటికి అరుపులు కేకలు వినిపించాయని చెప్పారు.
లోపలికి వెళ్లి, గొడవ పెట్టుకో వద్దని చెప్పేందుకు ప్రయత్నించిన నవీత్ పై ఒక భారతీయ విద్యార్థి కత్తితో ఛాతీపై పొడిచాడని తెలిపారు. దాడి చేసిన విద్యార్థి కూడా కర్ణాలు చెందినవాడేనని యశ్వీర్ తెలిపారు. ఆదివారం ఉదయం తమకు ఈ సమాచారం అందిందని ఆయన చెప్పారు. నవీత్ స్నేహితుడికి కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయని తెలిపారు. నవీజీత్ తెలివైన విద్యార్థి అని, జూలై నెలలో సెలవుల నిమిత్తం సొంతూరికి రావాల్సి ఉన్నదని చెప్పారు. విద్యార్థి వీసాపై నవీత్ ఏడాదిన్నర క్రితమే ఆస్ట్రేలియా వెళ్లాడని యశ్వీర్ తెలిపారు. రైతు అయిన ఆయన తండ్రి తనకున్న ఎకరంన్నర భూమిని అమ్మి నవీత్ సంధును ఆస్ట్రేలియాకు పంపారని పేర్కొన్నారు. నవీత్ భౌతిక కాయాన్ని సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు సహకరించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com