Truck Mishap : పెళ్లి బారాత్‌పైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు దుర్మరణం

మృత్యువు కొన్నిసార్లు పగబట్టినట్టే ప్రవర్తిస్తుంది. మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపుపై నియంత్రణ లేని డంపర్ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 11 మందికి గాయాలు అయ్యాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ బాధితుల సమీప బంధువులకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ప్రకటించారు.
సోమవారం రాత్రి హోషంగాబాద్ జిల్లా అంచల్‌ఖేడా నుంచి ఊరేగింపు వస్తుండగా 45వ జాతీయ రహదారిపై ఘాట్ ఖమారియా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వ్యక్తులకు మొదట సుల్తాన్‌పూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించారు, ఆ తర్వాత వారందరినీ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) భోపాల్‌కు రిఫర్ చేశారు.
ప్రమాద సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ అరవింద్ కుమార్ దూబే, పోలీసు సూపరింటెండెంట్ వికాస్ కుమార్ సెహ్వాల్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, ప్రమాదం జరిగిన తర్వాత డంపర్ ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com