Dowry : ఫార్చ్యునర్ కట్నం ఇవ్వలేదని భార్య హత్య

సంపన్నుల ఇంట్లో సంపద కోసమే మర్డర్లు, ఘోరాలు జరుగుతాయనేది జగమెరిగిన సత్యం. ఇలాంటిదే ఆ వార్త. గ్రేటర్ నోయిడాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వరకట్నం వేధింపులతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కట్నం కింద ఫార్చ్యునర్తో పాటు రూ.21లక్షల క్యాష్ ఇవ్వలేదన్న కారణంతో.. మహిళ భర్త, అతని కుటుంబసభ్యులు ఆమెను చిత్రహింసలు పెట్టి చంపేశారు.
ఖడా చౌగన్పూర్ అనే గ్రామంలో నివాసముంటున్నాడు వికాస్. 2022 డిసెంబర్లో కరిష్మా అనే యువతితో అతడి వివాహం జరిగింది. పెళ్లి సమయంలోనే.. వికాస్ కుటుంబానికి రూ. 11లక్షల క్యాష్తో పాటు ఒక ఎస్యూవీని కట్నం కింద ఇచ్చింది కరిష్మా కుటుంబం. పెళ్లి తర్వాత కూడా కట్నం గురించి కరిష్మాను వేధించడం మొదలుపెట్టాడు వికాస్. అతని కుటుంబం కూడా కరిష్మాను వేధించింది.
వికాస్ కుటుంబం అనేకమార్లు కరిష్మాను భౌతికంగా, మానసికంగా హింసించింది అని అమ్మాయి సోదరుడు దీపక్ చెప్పారు. వికాస్-కరిష్మాలకు ఆడ బిడ్డ ఉందన్నారు. కట్నం వేధింపులు మరింత పెరిగాయనీ.. ఈ వ్యవహారం స్థానిక పంచాయతీ పెద్దల దృష్టికి కూడా వెళ్లిందనీ.. రెండు కుటుంబాలు కలిసి, విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నించారనీ.. తమ కుటుంబం.. వికాస్ ఫ్యామిలీకి మరో రూ. 10లక్షలు ఇచ్చిందని దీపక్ చెప్పాడు. అప్పటికీ వరకట్న వేధింపులు ఆగలేదని అన్నాడు. వికాస్ కుటుంబం.. ఒక ఫార్చ్యునర్తో పాటు రూ. 21లక్షల కట్నం డిమాండ్ చేయడం మొదలుపెట్టిందనీ.. ఈ క్రమంలోనే శుక్రవారం దారుణం చోటుచేసుకుందని కుటుంబం ఆరోపిస్తోంది. వికాస్, అతని తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. పోలీసులు వికాస్, అతని తండ్రి సోంపాల్ భాటిని అరెస్ట్ చేశారు. తల్లి రాకేశ్, సోదరి రింకి, సోదరులు సునీల్- అనిల్లపై కేసులు పెట్టారు. వారు పరారీలో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com