Facebook Scam : ఫేస్‌బుక్‌లో వ్యాపారవేత్తకు ఓ మహిళ రూ. 95 లక్షలతో టోకరా

సోషల్ మీడియా వచ్చాక ఆన్‌లైన్ వేదికగా రోజుకో తరహా స్కామ్ బయటపడుతోంది. కొరియర్ స్కామ్, పార్ట్‌టైం జాబ్ స్కామ్ అంటూ ఆన్‌లైన్ అడ్డాగా సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. ఇక లేటెస్ట్‌గా ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళ గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను రూ. 95 లక్షలకు ముంచేసింది. అల్కాపురికి చెందిన బిజినెస్‌మెన్ దేశాయ్‌కి ఓ అపరిచిత మహిళ నుంచి ఫేస్‌బుక్ రిక్వెస్ట్ రాగా యాక్సెప్ట్ చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో ఎఫ్‌బీ వేదికగా స్టెఫ్ మిజ్ అనే మహిళ ఆయనకు పరిచయమైంది.
ఆపై ఇద్దరూ తరచూ చాట్ చేస్తూ వాట్సాప్‌లోనూ ముచ్చటించుకునేవారు. ఇద్దరి మధ్య వర్చువల్ ఫ్రెండ్‌షిప్ బలపడటంతో స్టెఫ్ ఓ స్టెప్ ముందుకేసి భారీ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉందని దేశాయ్‌ను మభ్యపెట్టింది. భారత్ నుంచి తమ కంపెనీకి హెర్బల్ ఉత్పత్తులు అవసరమని వాటికి దళారీగా వ్యవహరిస్తూ పెద్దమొత్తంలో ఆర్జించవచ్చని దేశాయ్‌ను ప్రలోభాలకు గురిచేసింది. ఈ ఉత్పత్తులను ప్యాకెట్‌కు రూ లక్షకు కొనుగోలు చేసి తమ కంపెనీకి రెట్టింపు మొత్తానికి విక్రయించవచ్చని నమ్మబలికింది. ఇది లాభసాటి వ్యాపారంగా భావించిన దేశాయ్ అందుకు అంగీకరించారు.
ప్రొడక్ట్స్ కలెక్షన్స్ కోసం డాక్టర్ వీరేంద్ర అనే వ్యక్తిని దేశాయ్‌కు మహిళ పరిచయం చేసింది. వారి మాటలను నమ్మిన దేశాయ్ హెర్బల్ ప్రోడక్ట్స్ శాంపిల్ ప్యాకెట్ కోసం రూ. 95 లక్ష వీరేంద్ర ఖాతాకు బదలాయించారు. శాంపిల్ ప్యాకెట్స్‌ను ఓపెన్ చేయవద్దని వారించడంతో వాటిని వెంటనే దేశాయ్ ఓపెన్ చేయలేదు. ఆపై అధిక లాభాల ఆశ చూపి పలు కారణాలను చూపుతూ దేశాయ్ నుంచి పెద్దమొత్తంలో వీరేంద్ర వివిధ బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయించుకున్నాడు. ఆపై మరికొంత డబ్బును వీరేంద్ర డిమాండ్ చేయడంతో దేశాయ్ మోసపోయానని గ్రహించారు. తాను చెల్లించిన డబ్బును రిఫండ్ చేయాలని దేశాయ్ స్కామర్లను నిలదీయడంతో వారు కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేసుకున్నారు. ఇక శాంపిల్ ప్యాకెట్స్‌ను దేశాయ్ ఓపెన్ చేయగా అందులో ఫ్రైడ్ చిప్స్, మత్తు పదార్ధాలు ఉండటంతో దేశాయ్ కంగుతిన్నారు. నిందితులు వీరేంద్ర, స్టెఫ్ మిజ్‌పై దేశాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com