Youngster Commits Murder : ప్రేమ, పెండ్లి పేరిట వేధింపులు .. యువకుడి హత్య

Youngster Commits Murder : ప్రేమ, పెండ్లి పేరిట వేధింపులు .. యువకుడి హత్య
X

జగిత్యాల జిల్లా (Jagityala District) మల్యాల మండలం తక్కళ్లపల్లిలో సోమవారం మధ్యాహ్నం పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన భోగ మహేశ్​(30) (Bhoga Mahesh) హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం...తక్కళ్లపల్లికి చెందిన మనీషాను..మహేశ్ ​మూడేండ్లుగా ప్రేమ, పెండ్లి పేరుతో వేధిస్తున్నాడు. దీంతో 2022 లో అతడిపై కేసు నమోదైంది. ఈ కేసు కోర్టులో నడుస్తున్నా మహేశ్ ​తీరు మార్చుకోకుండా యువతిని మళ్లీ వేధింపులకు గురి చేయడంతో ఈనెల 2 న ఆమె కుటుంబసభ్యులు పీఎస్​లో మళ్లీ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మహేశ్​కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.

సోమవారం మధ్యాహ్నం మహేశ్​సదరు యువతి ఇంటికి వెళ్లగా ఆమె కుటుంబసభ్యులతో గొడవ జరిగింది. ఈ క్రమంలో యువతి తల్లి భేతి సత్తమ్మపై మహేశ్​కత్తితో దాడి చేశాడు. అడ్డుకున్న యువతి తాత నర్సయ్య, అన్న మనోజ్​కు గాయాలయ్యాయి. దీంతో అందరూ కలిసి ఎదురుదాడికి దిగి బండతో కొట్టగా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, సీఐ దామోదర్ రెడ్డి, ఎస్ఐ అబ్దుల్ రహీం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు యువతితో పాటు, తల్లి, అన్న, తాత, అమ్మమ్మపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story