Former IRS officer : శ్రీవారిపై అచంచలమైన భక్తిని చాటుకున్న భక్తుడు

హైదరాబాద్ కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ శ్రీ వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు తన మరణానంతరం వీలునామా ద్వారా టీటీడీకి రూ.3 కోట్ల విలువైన నివాస గృహంతో పాటు తన బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న రూ.66 లక్షలను విరాళంగా అందించి అచంచలమైన భక్తిని చాటుకున్నారు.
హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతంలో ఉన్న “ఆనంద నిలయం” అనే 3,500 చదరపు అడుగులు గల భవనాన్ని, ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఆయన టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు వీలునామాలో పేర్కొన్నారు.
తను బ్యాంకులో దాచుకున్న సొమ్మును టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.36 లక్షలు, శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.6 లక్షలు, శ్రీవాణి ట్రస్టుకు రూ.6 లక్షలు విరాళంగా అందివ్వాలని సంకల్పించారు.
తన జీవితాంతం శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో అంకితమై ఉండాలని ఆకాంక్షించిన శ్రీ భాస్కర్ రావు అంతిమ కోరిక మేరకు ఆయన మరణానంతరం ట్రస్టీలు శ్రీ ఎం.దేవరాజ్ రెడ్డి, శ్రీ వి.సత్యనారాయణ, శ్రీ బి.లోకనాథ్ లు వీలునామా ప్రకారం టీటీడీకి చెందాల్సిన ఆస్తి పత్రాలు, చెక్కులను గురువారం ఉదయం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సీ.హెచ్. వెంకయ్య చౌదరి అందజేశారు.
ఈ మేరకు శ్రీ భాస్కర్ రావు గారి ట్రస్టీలను అదనపు ఈవో సత్కరించి ఈ సత్కార్యానికి కృషి చేసినందుకు గాను అభినందనలు తెలియజేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com