TTD : సెప్టెంబర్ 6న తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం

తిరుమలలో సెప్టెంబరు 6వ తేదీన అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీభూవరాహస్వామి ఆలయం పక్కనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు తీసుకువెళ్లి అర్చకులు ఆగమొక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి తిరిగి ఆలయానికి వేంచేపు చేస్తారు. కాగా అనంతుడు అనగా ఆదిశేషుడు. ఆదిశేషుడుపై అనంతపద్మనాభస్వామివారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యంకోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయన మూర్తిగా శ్రీ అనంత పద్మనాభస్వామికి అంతే వైశిష్ఠ్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఘనంగా నిర్వహిస్తారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com