TTD : తిరుమలలో వైకుంఠ ఏకాదశికి వేగంగా ఏర్పాట్లు.. ఈ దర్శనాలు రద్దు

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అవకాశం కల్పిస్తోంది. వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై టీటీడీ విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులకు అడిషనల్ ఈవో దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయనున్న 9 కేంద్రాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా టీ, పాలు, కాఫీ పంపిణీ చేయాలని సూచించారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతిస్తారు. కేటాయించిన దర్శన తేదీ రోజున మాత్రమే భక్తులకు తిరుమలకు అనుమతి ఇస్తారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా పది రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ, మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు చేశారు. గోవింద మాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com