Srisailam : శ్రీశైలం మల్లన్న భక్తులకు బిగ్ అలర్ట్ .. ఉచిత స్పర్శదర్శనం రద్దు

శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం తాత్కాలికంగా రద్దు చేయబడింది. జూలై 13, 2025 (ఆదివారం) అర్ధరాత్రి నుంచి జూలై 15 నుంచి 18 వరకు ఉచిత స్పర్శ దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భక్తులు, పర్యాటకుల రద్దీ భారీగా పెరిగింది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని, భక్తులకు అలంకార దర్శనం మాత్రమే కల్పించాలని దేవస్థానం నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెలలో (జులైలో) శ్రావణ మాసం ప్రారంభం కానుండటం, పర్వదినాలు ఉండటం, వారాంతాల్లో (శని, ఆదివారాలు) భక్తుల రద్దీ పెరుగుతుండటం వలన ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు. ఈ మార్పులను గమనించి భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు కోరారు. శ్రీశైలంలో జూలై 1, 2025 నుంచే ఏడాది విరామం తర్వాత ఉచిత స్పర్శ దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1:45 నుండి 3:45 వరకు ఈ దర్శనానికి అనుమతించారు. ఇందుకోసం టోకెన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు.అయితే, భక్తుల రద్దీని బట్టి ప్రత్యేక పర్వదినాల్లో ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు దర్శన నియమాలను మారుస్తుంటారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com