Vijayawada Temple Timings : బెజవాడ కనకదుర్గ గుడికి వెళ్తున్నారా.. పూజా సమయాలు తెలుసుకోండి

దసరా నవరాత్రి ఉత్సవాల సంబరాలు మొదలయ్యాయి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శ్రీ బాలాత్రిపురసుందరీదేవి అవాతారంలో భక్తులకు దర్శమిస్తున్నారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనదనీ, బాలా మంత్రం సమస్త దేవీమంత్రాల్లోకెల్లా అత్యున్నతమైనదనీ ఆధ్యాత్మికులు చెబుతారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం బాలాత్రిపురసుందరీదేవి. ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయనీ, సర్వ సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
శరన్నవరాత్రోత్సవాల కోసం విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు 13 నుండి 15 లక్షలు మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కాగా ఈ సారి నవరాత్రి ఉత్సవాలకు లేజర్ షో, కృష్ణమ్మ నదికి హారతి హైలెట్‌కానున్నాయి.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవాల్లో మొదటి రోజు అమ్మవారి దర్శనం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. నవరాత్రులలో రెండో రోజు నుంచి అంటే అక్టోబర్ 4వ తేదీ తెల్లవారు జామున 4 గంటల నుంచి అమ్మవారి దర్శనాలు ప్రారంభం అవుతాయి. మహా నివేదన సమయం లో కాసేపు దర్శనాలు విరామం ఉంటుంది. ఖడ్గమాల ప్రత్యేక కుంకుమర్చనలు కూడా జరగనున్నాయని.. ప్రతిరోజూ 9 గంటలకు చండియాగం జరగనుందని తెలిపారు. అంతేకాదు ఈ శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు పరోక్ష సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12 వ తేదీన తెప్పోత్సవం నిర్వహించనున్నారు. అంతేకాదు ఈ రోజు పూర్ణహుతి కార్యక్రమంతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి
ఉత్సవాల సందర్భంగా అమ్మవారి అంతరాలయం దర్శనాలను రద్దు చేశారు. . నగరంలోని పలు ప్రాంతాల్లో రూ.300, రూ. 500 దర్శనాలు టికెట్స్, ప్రసాదాల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు దేవస్థానం తెలిపింది. భక్తులు దర్శనం కోసం వచ్చే అన్ని క్యూ లైనుల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వృద్ధులకు, వికలాంగులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకునే వీలుని కల్పిస్తున్నారు. ఇక దసరా సందర్భంగా దుర్గాదేవి దర్శనం కోసం వచ్చే ప్రముఖుల కోసం ప్రోటోకాల్ దర్శనం ఉదయం 8 నుండి 10 వరకు సమయాన్ని నిర్దేశించినట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com