Annavaram Temple : అన్నవరం ప్రసాదం కల్తీ..? భక్తుల ఆందోళన

ప్రముఖ పుణ్యక్షేత్రం కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రసాదంపై వివాదాలు ఏర్పడుతున్నాయి. తిరుపతి లడ్డు తరహాలోనే ఈ ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ విషయం బయటపడ్డాక అన్నవరం ప్రసాదం అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. స్వామివారి ప్రసాదాన్ని ఎర్ర గోధుమ నూక ,నెయ్యి పంచదారతో తయారు చేస్తారు . ఇక్కడ నేతికి సంబంధించి కాంటాక్ట్ ముగిసింది. దీంతో అధికారులు ప్రభుత్వంతో సంప్రదించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు విజయ డైరీ నెయ్యి వాడాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో విజయ డైరీ సరఫరా చేసే నేతిని మాత్రమే వాడుతున్నారు. తాజాగా మరో వివాదం బయటికి వచ్చింది .
గత సెప్టెంబర్ నెలలో ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు ఇక్కడ శాంపిల్స్ తీసుకెళ్లారు. వారు తీసిన శాంపిల్స్ లో బెల్లం లో తేడా ఉన్నట్టు గుర్తించారు. బెల్లంలో పంచదారలో ఉండే సుక్రోజు ఎక్కువగా ఉందని రెండు రోజుల క్రితం నివేదిక వచ్చింది. ఈ విషయాన్ని కల్తీ నిరోధక శాఖ అధికారులు బయటపెట్టారు. దీంతో ప్రసాదం పై భయం పట్టుకుంది. ఆహార కల్తీ నియంత్రణ శాఖ నివేదిక ప్రకారం బెల్లంలో పంచదార శాతం అధికంగా ఉందని తేలింది.
ఆలయ అధికారులు మాత్రం తాము ప్రసాదంలో ఎటువంటి పరిస్థితుల్లో బెల్లం వాడము.. పంచదార మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేస్తున్నారు . కానీ అన్నదానంలో వినియోగించే సాంబారు, ప్రతి మంగళవారం నివేదనలో సమర్పించే అప్పాలు లో బెల్లం వినియోగిస్తామని వెల్లడించారు. దాంతో తేడా వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కాంటాక్ట్ మార్చే విషయం పరిశీలిస్తామని చెబుతున్నారు. ప్రసాదంలో కల్తీ అంటూ వార్తలతో భక్తులు కలవర పడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com