Komuravelli Mallanna Jatara : కొమురవెల్లి మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తులు

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మల్లన్న జాతరకు భక్తులు పోటెత్తారు. మల్లన్న మహా జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారంను పట్నం వారంగా వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు సమీప జిల్లాల నుంచి లక్ష మందికిపైగా భక్తులు ఈ వేడుకకు తరలివచ్చారు. శనివారం రాత్రే క్షేత్రానికి చేరుకుని దూళి దర్శనం చేసుకొని.. వసతి గదులలో బసచేశారు. ఆదివారం వేకువజాము నుంచే మల్లన్న స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి....స్వామి వారికి ఒడి బియ్యం పోసి, పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. పట్నం వారం సందర్భంగా స్వామికి భక్తులు బోనాన్ని సమర్పించారు. బోనం వండిన పాత్రలను పసుపు, కుంకుమ, బియ్యం పిండితో అలంకరించి డప్పు చప్పుల్లతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని స్వామికి సమర్పించారు.
స్వామివారికే కాకుండా గుట్టపై కొలువైన మల్లన్న సోదరి రేణుకా దేవికీ కూడా భక్తులు బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. పట్నం వారం సందర్భంగా ఆలయం నుంచి రెండు కిలో మీటర్ల దూరం వరకు భక్తులు నిండిపోయారు. ధర్మ దర్శనం క్యూ లైన్లు రాజగోపురం నుంచి మల్లన్న చెరువు వరకు కొనసాగాయి. ధర్మదర్శనం భక్తులకు సుమారు 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటలు, శీఘ్ర దర్శనానికి 3 గంటలు, వీవీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీ నేపథ్యంలో రాత్రి పొద్దుపోయే వరకు అధికారులు దర్శనాలను కొనసాగించారు.
ఒంటినిండా బండారి రాసుకొని.. చేతిలో ఈరకోలతో భక్తులకు పూనకం వచ్చే విధంగా పోతరాజుల విన్యాసాలు ఆలయ పరిసరాల్లో మల్లన్ననామస్మరణతో ప్రతిధ్వనించాయి. పోతరాజులతో పాటు శివసత్తుల సిగాలూ భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు ఉదయం పెద్ద పట్నం, అగ్ని గుండాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పది వారాల పాటు సాగే జాతర.. మార్చి 24న అగ్నిగుండాలతో ముగుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com