Kondagattu Anjaneya Swamy : కొండగట్టు అంజన్న భక్తులకు గుడ్ న్యూస్

తెలంగాణలోని కొండగట్టు ఆలయంలోని అంజనేయస్వామి వారిని దర్శించుకోవాడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో అంజన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. కొండగట్టు భక్తుల కోరిక మేరకు 100 గదుల నిర్మాణానికి టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొండగట్టు అంజన్న భక్తుల గదుల కోసం కావలసిన స్థలాన్ని పరిశీలించారు. వివరాల్లోకి వెళితే.. కొండగట్టు ఆలయానికి వస్తున్న వారి కోసం బస చేసేందుకు ఎటువంటి గదులు లేకపోవడంతో టీటీడీకి ఆలయం వద్ద గదుల నిర్మాణానికి భక్తులు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ మేరకు టీటీడీ 100 గదుల నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం మరువలేనిది అని తెలిపారు. కొండగట్టు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం100 కోట్లు ఇస్తామని చెప్పి అంజన్న భక్తులను మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల సహకారంతో కొండగట్టును అభివృద్ధి చేసుకుంటామని ఆయన తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com