Tallapaka : తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామివారి ఆలయాల్లో వైభవంగా ధ్వజారోహణం

టిటిడికి అనుబంధంగా ఉన్న అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం వైభవంగా ధ్వజారోహణం నిర్వహించారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం 06.16 గం.లకు ధ్వజారోహణంను చేపట్టారు. సాయంత్రం 06 గం.లకు హంసవాహన సేవపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి రోజూ ఉదయం 08.00 గం.లకు, సాయంత్రం 06.00 గం.లకు వాహన సేవలు జరుగనున్నాయి.
జూలై 11న సాయంత్రం 6.00 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. జూలై 14న ఉదయం 10.00 – 12.00 గంటలకు వసంతోత్సవం, త్రిశూలస్నానం, సాయంత్రం 05.00 – 06.00 గం.ల మధ్య ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జూలై 15వ తేదీన ఉదయం 09.00 గం.లకు స్నపన తిరుమంజనం, రాత్రి 06.00 – 08.00 గం.ల మధ్య పుష్పయాగం చేపడుతారు.
శ్రీ చెన్నకేశవస్వామివారి వాహనసేవలు :
జూలై 06న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య సింహలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 07.00 గం.లకు శేషవాహన సేవ నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 09.00 గం.లకు, రాత్రి 07.00 గం.లకు వాహన సేవలు ప్రారంభమవుతాయి.
జూలై 11వ తేదీ సాయంత్రం 6 గం.లకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 08.30 గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరిస్తారు. జూలై 14న ఉదయం 09.30 – 10.15 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6.00 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
జూలై 15వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండ్ శ్రీ వై. హనుమంతయ్య, టెంపుల్ ఇన్పెక్టర్ శ్రీ డి. బాలాజీ, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com