Tirumala : భారీ వర్షాలతో తిరుమల అతలాకుతలం..!

భారీ వర్షాలు, వరదలు.. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిని వణికిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తిరుపతి నగరంలో ఎడతెరపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం రేపిన బీభత్సానికి తిరుపతి పూర్తిగా జలమయం కాగా.. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
తిరుపతి నగరంలో ఎటుచూసినా చెరువును తలపిస్తోంది. కపిల తీర్థం, మల్వాడి గుండం జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు తిరుమాడ వీధులు జలమయం అయ్యాయి. రెండో కనుమదారిలో వాహనాలు నిలిచిపోయాయి. వైకుంఠ క్యూలైన్లలోని సెల్లార్‌లోకి సైతం వరద నీరు చేరింది. అలిపిరి నడకమార్గం నీటి ప్రవాహంతో ప్రమాదకరంగా మారింది.
భారీ వర్షం కారణంగా తిరుమల కనుమదారిలో కొండ చరియలు విరిగిపడగా.. పాపవినాశనం, అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలు, ఘాట్ రోడ్లను టీటీడీ అధికారులు మూసివేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సిబ్బంది రాళ్లను తొలగిస్తున్నారు. వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహించడంతో ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇటు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో భారీగా వరద చేరడంతో రేణిగుంట విమానాల ల్యాండింగ్‌ను అధికారులు నిలిపివేశారు.
భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు వీస్తుండటంతో వక్షాలు నెలకొరిగాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్‌లు వర్షపు నీటితో నిండిపోయాయి. నగరంలోని కరకంబాడి మార్గంలో భారీగా వరద నీరు చేరింది. ఇళ్లలో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో జనజీవనం స్తంభించింది. తిరుపతి బస్టాండు మొత్తం నీరు నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.
సహాయక చర్యలు అందించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన కలెక్టర్.. అత్యవసరమైతే తప్పా ప్రజలెవరు బయటకి రావొద్దని సూచించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇవాళ కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో తిరుపతి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com