Vijayawada : సౌకర్యాలతో ఇంద్రకీలాద్రి ముస్తాబు.. 3 నుంచే శరణ్నవరాత్రులు
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి 12 వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దుర్గమ్మ దర్శనార్థం వస్తుంటారు. ఈ సందర్భంగా క్యూలైన్ల నిర్వహణ, బందోబస్తు, చోరీలు జరగకుండా నగర పోలీసులు సిద్ధమయ్యారు. వీఐపీల రాకతో సామాన్య భక్తులు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్సవాలకు దాదాపు ఐదు వేల మంది అధికారులు, సిబ్బందిని మోహరిస్తున్నారు.
అమ్మవారి దర్శనం కోసం రోజుకు లక్ష మంది చొప్పున వస్తారని అంచానా వేస్తున్నారు. మూలా నక్షత్రం రోజు 2.5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా. దసరా రోజు నిర్వహించే తెప్పోత్సవానికి రెండు లక్షల మంది వరకు వస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండపైన, దిగువన ట్రాఫిక్, భక్తుల రద్దీ నియంత్రణకు నగర కమిషనరేట్‌లోని సిబ్బందికి తోడుగా వివిధ జిల్లాల నుంచీ పోలీసులను పిలిపిస్తున్నారు. తొమ్మిది రోజులపాటు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోజుకు మూడు షిఫ్టుల్లో విధులు కేటాయించనున్నారు. తొక్కిసలాటకు తావులేకుండా ప్రత్యేకంగా కంపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో దాదాపు 15వేల మంది వరకు వేచి ఉండే అవకాశం ఉంది.
ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి దృశ్యాలను చూసేందుకు 24 గంటలూ పని చేసేలా కంట్రోల్ రూమ్‌లో సిబ్బందికి విధులు కేటాయిస్తున్నారు. లక్షల్లో భక్తులు వస్తున్నందున నేరస్థుల కదలికలపైనా నిఘా ఉంచబోతున్నారు. చోరీలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలు, సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని నియమించనున్నారు. డ్రోన్లతో అవసరమైన చోట్ల చిత్రీకరిస్తారు. వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం పోలీసు సేవాదళ్ వాలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com