పూరీలో ఘనంగా ప్రారంభమైన జగన్నాథుడి రథ యాత్ర

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం ఓడిశాలోని పూరి క్షేత్రం. ఇక్కడ కొలువైన జగన్నాథుడి రథ యాత్ర ప్రారంభం అయింది.ప్రతి సంవత్సరం ఆషాడ మాసం శుక్ల విదియ రోజున జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమై ఏకాదశి వరకు కొనసాగుతుంది. జగన్నాథ రథయాత్రలో పాల్గొనడానికి పుణ్యక్షేత్రానికి దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు.పూరి నగరం జనసంద్రాన్ని తలపిస్తోంది.జగన్నాథుడు తన అన్న బలభద్రుడు,చెల్లెలు సుభద్రలతో కలిసి నగరంలో విహరిస్తారు. ఈ రథయాత్ర కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద చెక్క రథాన్ని సిద్ధం చేశారు. ఈ రథాన్ని ని లాగడమే కాకుండా కనీసం రథం తాళ్లను తాకినా, కదిలించినా కూడా పుణ్యమైన కార్యక్రమంగా భావిస్తారు.
ఇక సనాతన సంప్రదాయంలో బలభద్ర భగవానుడు ఆది శేషుడు రూపంగానూ, జగన్నాథుడు శ్రీవిష్ణువు రూపంగానూ పరిగణించబడుతుండగా సుభధ్రా దేవి శ్రీకృష్ణుని సోదరిగా భావించి పూజిస్తారు.ఆషాఢమాసం వస్తోందనగానే అందరికీ జగన్నాథుని రథయాత్రే గుర్తుకువస్తుంది. ఆషాఢమాసంలోని రెండోరోజు ఈ పండుగ చేస్తారు.ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర. ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా తెలియదు. అందుకే బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణంలాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తుంది.
మరోవైపు ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకి వాడతారు. కానీ పూరీలో సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్లే గుడి బయటకు వస్తారు. ఆ సమయంలో వాళ్లని ఏ మతం వాళ్లయినా చూడవచ్చు. ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారుచేస్తారు. వీటి తయారీని అక్షయతృతీయ రోజున మొదలుపెడతారు. జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడధ్వజం అనీ బలభద్రుని కోసం తయారుచేసే రథాన్ని తాళధ్వజం అనీ సుభద్ర కోసం తయారుచేసే రథాన్ని దేవదాలన అనీ పిలుస్తారు.
ఇక జగన్నాథుడు గుండిచా ఆలయం నుంచి తిరిగివచ్చే యాత్రని బహుద యాత్ర అంటారు.ఈ యాత్రలో భాగంగా రథాలన్నీ మౌసీ మా అనే గుడి దగ్గర ఆగి అక్కడ తమకి ఇష్టమైన ఓ ప్రసాదాన్ని స్వీకరించి బయల్దేరతాయి. జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తర్వాత సునా బేషా అనే ఉత్సవం జరుగుతుంది.అంటే దేవుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచెత్తుతురన్నమాట. దీనికోసం దాదాపు 208 కిలోల బరువున్న నగలను ఉపయోగిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com