Karthika Masam 2021 : ఇవాళ్టి నుంచి మొదలైన కార్తీకమాసం.. శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తోన్న భక్తులు..!

Karthika Masam 2021 : హిందూ సంప్రదాయంలో మహిమాన్విత మాసంగా భావించే కార్తీకమాసం ఇవాళ్టి నుంచి మొదలైంది. తెల్లవారకముందే శివాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు మొదలయ్యాయి. భక్తులు నదీస్నానాలు చేసి, కార్తీక దీపాలు వెలిగించారు. ఈ కార్తీక మాసంలో నదీస్నానం, దానం, జపం, పూజ, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు చేయడం వల్ల పాపప్రక్షాళన జరుగుతుందనే విశ్వాసం ఉంది. అందుకే, చలిని సైతం లెక్కచేయకుండా.. ఉదయాన్నే కార్తీక దీపాలు వెలిగిస్తారు భక్తులు. ఈ పుణ్య మాసంలో కార్తీక సోమవారాలు అత్యంత పవిత్రమైనవిగా శివపురాణం చెబుతోంది.
పరమ శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీకమాసానికి సమానమైన మాసం లేదని స్కంద పురాణం చెబుతోంది. అలాగే, కార్తీక మాసంలో శివారాధనతో పాటు మహా విష్ణువును పూజించడం, విశేషించి సత్యనారాయణ వ్రతం ఆచరించడం అనంత ఫలాన్ని ఇస్తుందని వేదాలు చెబుతున్నాయి. ఏటా దీపావళి మరుసటి రోజు నుంచి ఈ పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో వచ్చే పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. దేశం నలుమూలలా ఉన్న శివాలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుగుతాయి.
ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్రపుణ్య నదీ స్నానం ఆచరించి, ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, లలిత, విష్ణు సహస్రనామ పారాయణాలు, నిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్య ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకమాసం 30 రోజుల పాటు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని వేదం చెబుతోంది. కార్తీకమాసంలో దీపదానం అత్యంత శ్రేష్టం అని చెబుతోంది శాస్త్రం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com