Komuravelli Temple : మల్లన్న కళ్యాణానికి ముస్తాబైన కొమురవెల్లి ఆలయం

తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 10-.45 గంటలకు తోటబావి వద్ద మల్లికార్జునస్వామి, బలిజ మేడల దేవి, గొల్లకేతమ్మల కల్యాణం వైభవంగా నిర్వహించారు. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం ఈ కల్యాణం జరుపుతున్నారు. వరుడు మల్లికార్జునస్వామి తరఫున పడిగన్నగారి వంశస్తులు, వధువులు బలిజ మేడలదేవి, గొల్లకేతమ్మ తరఫున మహాదేవుని వంశస్తులు పెండ్లి పెద్దలుగా వ్యవహరించనున్నారు. స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా 29, 30 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 29న ఆదివారం ఉదయం ఐదు గంటలకు దృష్టి కుంభం, 10.45 గంటలకు కల్యాణోత్సవం, రాత్రి 7 గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు. 30న సోమవారం ఉదయం 9 గంటలకు ఏకాదశ రుధ్రాభిషేకరం, లక్షబిల్వార్చన, మహా గళహారతి, మంత్ర పుష్ప కార్యక్రమాలను జరుగుతాయి. మల్లన్న కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున పట్టవస్త్రాలు, పుస్తెమెట్టెలు, ముత్యాల తలంబ్రాలను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అందజేయనున్నారు.
మల్లన్న కల్యాణోత్సవానికి సుమారు 30 వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. తోటబావి వద్ద జరిగే కల్యణోత్సవాన్ని తిలకించేందుకు వీలుగా ప్రత్యేక గ్యాలరీలతో పాటు ఎల్‌ఈడీ స్క్రీన్లను సైతం సిద్ధం చేస్తున్నారు. కల్యాణ వేదికపైన మంత్రులు, ఎమ్మెల్యేలకు, వేదిక పక్కన వీవీఐపీలకు, సామాన్య భక్తులు కూర్చునేలా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా రాజగోపురం నుంచి హనుమాన్ ఆలయం వరకు క్యూలైన్లపై చలువ పందిళ్లు సిద్ధం చేస్తున్నారు. కల్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అడిషనల్ కలెక్టర్, తహసీల్దార్, ఆలయ కమిటీ సభ్యులు పరిశీలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com