TTD : ప్రకృతి పనితీరే పరమాత్మ లీలలు

పంచభూతాల పనితీరు అవగతం చేసుకోవడమే ఆధ్యాత్మిక మార్గానికి మొదటి మెట్టు అని ప్రముఖ ఆధ్యాత్మిక వ్యాఖ్యాత శ్రీ ఆదిత్య శర్మ చెప్పారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో బుధవారం సాయంత్రం శ్రీ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 103వ జయంతి సభ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా శ్రీఆదిత్య శర్మ ” శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ – ఆధ్యాత్మిక గమనం ” అనే అంశంపై మాట్లాడుతూ, వేదాలు సమర్ధించిన పురాణాలు, వైదిక వంశాలను మాత్రమే శ్రీ గౌరిపెద్ది అంగీకరిస్తారని తెలిపారు. ప్రతి పనికి భక్తిని జోడించి చేస్తే యజ్ఞం అవుతుందన్నారు. అన్నమాచార్య సంకీర్తనల్లోని సారాన్ని అందులోని విషయాన్ని వివరించారు.
అనంతరం విశ్రాంత ఎంఈఓ శ్రీ వెంకటరత్నం” శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ – శిష్య వాత్సల్య ” విశేషాలు అనే అంశంపై మాట్లాడుతూ, అద్భుతమైన సాహితీ సృజన చేసిన ప్రముఖులలో శ్రీ గౌరి పెద్ది ఒకరని అన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలను పరిష్కరించడంలో విశేష కృషి చేశారన్నారు. నేటి తరం వారు తమ కంటే ముందున్న గొప్ప తరాన్ని గురించి తెలుసుకోవాలన్నారు. భారత, భాగవత, పురాణ ఇతిహాసాలను అపూర్వ సాహిత్యంతో అందించిన సంకీర్తనలను గౌరపెద్ది రామసుబ్బశర్మ మనకు అందించారని వివరించారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మేడసాని మోహన్, శ్రీ గౌరి పెద్ది వెంకట భగవాన్, ఇతర అధికారులు, పురప్రజలు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com