Indrakiladri : తప్పిపోయినా భయం ఇకలేదు - చిన్నారులకు క్యూఆర్ కోడ్ బ్యాండ్లు

Indrakiladri : తప్పిపోయినా భయం ఇకలేదు - చిన్నారులకు క్యూఆర్ కోడ్ బ్యాండ్లు
X

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు దర్శనార్థం వస్తున్న నేపథ్యంలో, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భక్తుల సౌకర్యానికి పెద్దపీట వేశారు. చిన్నారుల భద్రతకు ప్రత్యేక క్యూఆర్ బ్యాండ్లు: దసరా సమయంలో గుడికి వచ్చే చిన్నారి భక్తులు తప్పిపోకుండా చూడటం కోసం ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పర్యవేక్షణలో చిన్నారుల చేతికి ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ రిస్ట్ బ్యాండ్‌లను కడుతున్నారు. ఈ బ్యాండ్‌లను స్కాన్ చేస్తే పిల్లల పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్లు వంటి సమాచారం వెంటనే అందుబాటులోకి వస్తుంది. ఎవరైనా చిన్నారి తప్పిపోయినట్లయితే, ఆ బ్యాండ్‌ను స్కాన్ చేసి నేరుగా తల్లిదండ్రులను ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించే సౌకర్యం కల్పించారు.

గతంలో భవానీ దీక్షా విరమణ సందర్భంగా ప్రవేశపెట్టిన చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ (CMS) క్యూఆర్ ట్యాగ్‌లు మంచి ఫలితాలు ఇవ్వడంతో, ఈసారి మరింత ఆధునికంగా జియో ట్యాగింగ్, అదనపు సాంకేతికత జోడించి వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. ఐసీడీఎస్ విభాగం ప్రత్యేక బృందాలు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, నగర ప్రవేశ ద్వారాలు, క్యూలైన్ల వద్ద చిన్నారుల భద్రత కోసం ఈ బ్యాండ్‌లను అందజేస్తున్నాయి. భక్తుల సౌకర్యం కోసం టెక్నాలజీ వినియోగం: ఈసారి దసరా ఉత్సవాల్లో ఏఐ కెమెరాలు, డ్రోన్‌లు, RFID చేతి బ్యాండ్‌లు వినియోగంలోకి తెచ్చారు. అలాగే ‘దసరా 2025 యాప్‌’ పేరుతో ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో ఉత్సవాల సమాచారం, దర్శన సమయాలు, సేవల వివరాలు, పార్కింగ్ సౌకర్యాల గురించి పూర్తి సమాచారం ఉంటుంది. భక్తులు ఎక్కడ సేవలు అందుబాటులో ఉన్నాయో, ఎలా చేరుకోవాలో ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు

Tags

Next Story