TTD : శ్రీనివాస కల్యాణం పేరుతో అనధికార శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు : టిటిడి

విదేశాలలో శ్రీనివాస కల్యాణం పేరుతో అనధికార నకిలీ శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం టిటిడి హెచ్చరించింది. యూకే లోని శ్రీ అద్వైత సేవా సమితి పేరుతో ఓ సంస్థ 06.09.2025వ తేదీన యూనైటెడ్ కింగ్డమ్ లోని Slough SL 1 3 LW వద్ద Singh Sabha Slough Sports Centreలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన పత్రికను వాట్సాప్ గ్రూప్ లలో వైరల్ చేశారు.
సదరు శ్రీనివాస కల్యాణ మహోత్సవం కార్యక్రమానికి ఏపీఎన్ఆర్టీఎస్ నుండి ఎలాంటి అనుమతి లేదు, టిటిడి కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. అయినప్పటికీ ఆహ్వాన పత్రికలో టిటిడికి చెందిన లోగోను వాడారు. టిటిడి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఒక విధంగా భక్తులను తప్పుదారి పట్టిస్తూ గందరగోళానికి గురిచేయడమే. అంతేకాక ఆహ్వాన పత్రికలో ఉచితం అని పేర్కొన్నప్పటికీ ప్రత్యేక సేవలకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదు. భక్తుల నుండి సేవా ఫీజుల పేరుతో వసూళ్లు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఆహ్వాన పత్రంపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగా, భక్తుల రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు సేవా ఫీజు (£ 566 పౌండ్లు) వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం కనిపించింది. డబ్బులు వసూలు చేసే అంశంతో పాటు టిటిడి కల్యాణ లడ్డూ ప్రసాదం, ఒక వెండి లాకెట్, ఒక నవరమ్ వేద వస్త్రం, అక్షింతలు, పసుపు, అమ్మవారి కుంకుమ, చీర, మంగళ్యం ధారం, జాకెట్టు, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఫోటో ఫ్రేమ్ ఉన్నాయి. సదరు నకిలీ శ్రీనివాస కల్యాణ మహోత్సవంపై ఫిర్యాదు రావడంతో చర్యలకు విజిలెన్స్ శాఖను టిటిడి ఆదేశించింది.
భక్తులను గందరగోళానికి గురిచేసే అనధికార కార్యక్రమాలపై అప్రమత్తంగా ఉండాలని టిటిడి సూచించింది. టిటిడి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా టిటిడి పేరుతో శ్రీనివాస కల్యాణ మహోత్సవం జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నకిలీ కల్యాణోత్సవాల పేరుతో ఎవరైనా సమాచారాన్ని వైరల్ చేసి డబ్బులు కోరితే టిటిడి విజిలెన్స్ విభాగం దృష్టికి తీసుకురావాలని కోరుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com