Puri Jagannath : పూరీ రత్న భాండాగారంలో తెరుచుకున్న మూడో గది

పూరిలోని జగన్నాథుడి రత్న భాండాగారంలోని మూడో గది తలుపులు కూడా తెరుచుకున్నాయి. జులై 18, 2024 గురువారం ఉదయం 9.51 గంటలకు గది తలుపులు తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. గది తాళాలు తెరవడానికి ముందు జగన్నాథుడికి పూజాది క్రతువులు నిర్వహించారు. తొలి విడతలో భాగంగా జులై 14న భాండాగారంలో రెండు గదులను తెరిచారు. అందులోని విలువైన ఆభరణాలు, వస్తువులను స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు.
మొదటి రాజు మాదిరిగానే అధికారులు ముందస్తు భద్రత చర్యలు తీసుకున్నారు. పాములు పట్టే వారు, ఒడిశా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది, అగ్నిమాపక సేవల అధికారులను గదికి కొద్దిదూరంలో సిద్ధంగా ఉంచారు. 8 గంటల నుంచి సింహద్వారం తెరిచి ఉండడంతో ఆలయంలోకి భక్తుల ప్రవేశంపై నిషేధం విధించారు. గురుత రత్న భాండాగారంలోకి ప్రవేశించే మందు పర్యవేక్షక కమిటీ చైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ మీడియాతో మాట్లాడారు. గదిలో భద్రపరిచిన విలువైన వస్తువులను తరలించడానికి జగన్నాథుడి ఆశీస్సులు తీసుకున్నామని చెప్పారు.
సంప్రదాయ దుస్తులు ధరించి, అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే భాండాగారంగదిలోకి పంపామని పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్ తెలిపారు. విలువైన వస్తువులను స్ట్రాంగ్ రూమ్ కు తరలించే ప్రక్రియను చేపట్టామని చెప్పారు. ఒక్కరోజులో తరలింపు ప్రక్రియ పూర్తవకుంటే, స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపీ) ప్రకారం పనులు కొనసాగుతాయని తెలిపారు. అలాగే ఆభరణాల తరలింపు ప్రక్రియను వీడియోగ్రఫీ తీస్తున్నామని, సీసీటీవీ కెమేరాలు కూడా ఏర్పాటు చేశామని, ఆలయం చుట్టూ తగిన భద్రత సిబ్బందని మోహరించామని పట్టణ ఎస్పీ పినాక్ మిశ్రా మీడియాకు తెలిపారు. రత్న భాండాగారం మరమ్మతు పనులను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) చేపడుతుంది. మరమ్మత్తు పనులు పూర్తయిన తర్వాతే ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల జాబితాను సిద్ధం చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com