సంప్రదాయ భోజనంపై అసత్య ప్రచారాన్ని ఖండించిన టీటీడీ..!

సంప్రదాయ భోజనంపై అసత్య ప్రచారాన్ని ఖండించిన టీటీడీ..!
'సంప్రదాయ భోజనం'పై ఈ తరహా ప్రచారం జరుగుతున్న విషయం తెలియగానే TTD అప్రమత్తమైంది. ఆ అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 'సంప్రదాయ భోజనానికి' శ్రీకారం చుట్టడం విమర్శలకు తావిచ్చింది. ఉచిత అన్నదానానికి ప్రపంచంలోనే పేరున్న తిరుమల పుణ్యక్షేత్రంలో, ఇప్పుడు అదే ధార్మిక సంస్థ కాస్ట్ టు కాస్ట్ అంటూ అన్నాన్ని అమ్మడం ఏంటని కొందరు ప్రశ్నించారు. నిత్యం స్వామి వారికి కోటానుకోట్ల రూపాయలు విరాళాలు వచ్చే చోట.. TTDనే స్వయంగా ధర నిర్ణయించి క్యాంటీన్లు నడపాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. నిత్యాన్నదాన సత్రం ఉండగా ఇప్పుడు కొత్తగా 'సంప్రదాయ భోజనం' పేరుతో వ్యాపార ధోరణి ఎందుకని విమర్శించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో TTD తీరును తప్పుపడుతూ కొందరు పోస్టులు పెట్టారు.

'సంప్రదాయ భోజనం'పై ఈ తరహా ప్రచారం జరుగుతున్న విషయం తెలియగానే TTD అప్రమత్తమైంది. ఆ అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. లాభాపేక్ష లేకుండా కేవలం ఆ సరుకులు కొనేందుకు ఎంత ఖర్చయ్యిందో అంతే డబ్బులు వసూలు చేస్తూ 'సంప్రదాయ భోజనం' భక్తులకు అందించాలనేదే దేవస్థానం నిర్ణయమని వివరణ ఇచ్చింది. తిరుమలలో నిత్య అన్నదాన్నం నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ధార్మిక సంస్థపై సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించారు. భక్తులు, దాతలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఈ అసత్య ప్రచారం నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ధనికుల నుంచి పేదల వరకూ అందరూ కచ్చితంగా ఉచిత అన్నదాన సత్రంలో భోజనం చేస్తారు. స్వామివారి అన్నప్రసాదానికి ఉన్న విశిష్టత అలాంటిది. అన్నదానంలో ఇంత పేరున్న క్షేత్రంలో.. ఇప్పుడు 'గో-ఆధారిత వ్యవసాయం ద్వారా పండిన ఆహార ఉత్పత్తులతో భోజనం' పేరుతో వడ్డించే వాటికి ధర నిర్ణయించడం ఎందుకు అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో TTD ఈ కార్యక్రమం చేపట్టిన ఉద్దేశాన్ని మరోమారు వివరించింది. టీటీడీ పరిధిలో ఇప్పటికే వేలం ద్వారా అనేక క్యాంటీన్లు ఉన్నాయి. 10 పెద్ద క్యాంటీన్లు, 7 జనతా క్యాంటీన్లు, 148 ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, 128 టీస్టాల్స్‌ నిర్వహణ బాధ్యత TTDనే చూస్తోంది. ఇప్పుడు ప్రయోగాత్మకంగా సాంప్రదాయ భోజనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాధ్యాసాధ్యాలను బట్టి నెమ్మదిగా మిగతా క్యాంటీన్‌ల నిర్వహణపై నిర్ణయం ఉంటుందని TTD తెలిపింది. లాభాపేక్ష లేకుండా సంప్రదాయ భోజ‌నం భ‌క్తుల‌కు అందించాలనే నిర్ణయానికి వక్రభాష్యం చెప్పడం సరికాదని EO జవహర్‌రెడ్డి అన్నారు.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రంలో స్వామి వారి దర్శనభాగ్యం కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు కోర్చి భక్తులు ఏడుకొండలు చేరుకుంటారు. గర్భాలయంలో మూలవిరాట్‌ని దర్శనం చేసుకుని ఆ దివ్యమంగళరూపాన్ని చూసి పరవశించిపోతారు. అలాగే ఒక రోజు కొండపై నిద్ర చేయనిదే తిరుమల యాత్ర పూర్తైనట్టు కాదు. ప్రస్తుతం కరోనా వల్ల భక్తుల్ని పరిమిత సంఖ్యలో అనుమతి ఇస్తున్నా.. 8 వేల మంది కొండకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమలలో పురాతన సాంప్రదాయానికి శ్రీకారం చుడుతూ గోవిందునికి గో-ఆధారిత నైవేద్యం సమర్పిస్తున్నారు. ఈ పథకంలో‌ భాగంగా దేశీయ ఆవుల ఉత్పత్తులతో చేసిన వ్యవసాయం ద్వారా పండించిన బియ్యం, పప్పు దినుసులు, బెల్లం, నెయ్యితో శ్రీవారికి అన్నప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అలాగే గోఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఆహార ఉత్పత్తులతోనే శ్రీవారి భక్తులకు కూడా భోజనం అందించాలనే ఉద్దేశంతో మహత్కార్యానికి టీటీడీ సంకల్పించింది.

శ్రీవారి భక్తుల కోసం టీటీడీ సాంప్రదాయ భోజనాన్ని అన్నమయ్య భవన్‌లో ప్రారంభించారు. ఉదయం పుల్లకారు బియ్యంతో ఇడ్లీలు, కాలాబాత్ బియ్యంతో ఉప్మా భక్తులకు అందిస్తుండగా.. మధ్యాహ్నం కొబ్బరి అన్నం పులిహోర, పూర్ణాలు, పచ్చి పులుసు, దోసకాయ పప్పు వంటి 14 రకాల వంటకాలు వడ్డిస్తున్నారు. దేశీయ వ్యవసాయంతో పండించిన బియ్యం, పప్పు దినుసులతో తయారు చేసిన అల్పాహారం, భోజనాన్ని ఎలాంటి ఆదాయం లేకుండా కాస్టు టూ కాస్టుతో భక్తులకు అందిస్తున్నారు.

సెప్టెంబర్ 8వ తేదీ వరకు ప్రతిరోజు 200 మందికి ఈ సంప్రదాయ భోజనాన్ని వడ్డిస్తారు. దీనిపై భక్తుల అభిప్రాయాలు సూచనలు తీసుకోబోతున్నట్టు దేశీయ గో-ఆధారిత వ్యవసాయ పరిశోధకులు విజయ్‌రామ్‌ చెప్తున్నారు. పూర్వీకులు మనకు అందించిన దేశీయ బియ్యం, పప్పు దినుసులు, కూరగాయలను టీటీడీ కొనుగోలు చేయడం అభినందనీయమని, ఈ తరహా ప్రయత్నం వల్ల విత్తనాలు, దేశీయ గో జాతులు వృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

తిరుమలలో దాతల సహకారంతో సంప్రదాయ భోజనాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టామని EO చెప్పారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని భుజించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, కరోనా సమయంలో శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి ఆహారంపై చర్చిస్తున్నారని వివరించారు. లాభాపేక్ష లేకుండా సంప్రదాయ భోజనాన్ని భక్తులకు అందిస్తామని, ఇందుకు కావాల్సిన ముడిపదార్థాలన్నీ సిద్ధం చేసుకుని శాశ్వత ప్రాతిపదికన పథకం అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఆగస్టు 26 నుంచి మొదలైన ఈ సంప్రదాయ భోజనం సెప్టెంబరు 8 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story