TTD : శ్రీవారి భక్తులకి టీటీడీ శుభవార్త.. !

TTD : శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను ఎల్లుండి విడుదల చేస్తోంది TTD. ఆన్‌లైన్‌లో భక్తులంతా ఆయా సేవలను బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత నెమ్మదిగా దర్శనాల సంఖ్యను పెంచుతూ వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు ఆర్జిత సేవలకు కూడా అనుమతి ఇస్తోంది. ఇన్నాళ్లూ స్వామి వారికి నిత్యసేవలను ఏకాంతంగానే నిర్వహించిన టీటీడీ, దాదాపు రెండేళ్ల తరువాత భక్తులను అనుమతిస్తుంది.
ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఆ టికెట్లను మార్చి 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను బుక్ చేసుకునే వీలు ఉంటుంది. ఎలక్ట్రానిక్ లక్కీడిప్ విధానంలో ఈ టికెట్లు కేటాయిస్తారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం వంటి వాటిల్లో భక్తులు పాల్గొనొచ్చు. ఈ సేవా టికెట్లు పొందేందుకు మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే వీలు ఉంటుంది.
తరువాత లక్కీడిప్ ద్వారా భక్తులకు టికెట్ల కేటాయింపు జరుగుతుంది. టికెట్లు పొందినవారి జాబితాను మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటల తరువాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. అదేవిధంగా SMS, ఇ-మెయిల్ ద్వారా భక్తులకు తెలియజేస్తారు. సేవా టికెట్లు పొందిన భక్తులు రెండు రోజుల్లోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఉత్సవమూర్తులకు నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన భక్తులు నేరుగా బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు.
3 నెలలకు సంబంధించిన సేవా టికెట్ల కోటా ఒకసారి చూస్తే రోజుకి సుప్రభాతం 270, తోమాల 10, అర్చన 10, అష్టాదళపాదపద్మారాధన 60, నిజ పాద దర్శనం 750 టిక్కెట్లు విడుదల చేస్తున్నారు. అలాగే కల్యాణోత్సవం 475, ఊంజల్‌సేవ 150, ఆర్జిత బ్రహ్మోత్సవం 275, సహస్ర దీపాలంకరణ సేవ 600 టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ కానీ రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని TTD విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ అయిన ''తిరుపతి బాలాజీ.AP.GOV.IN'' ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com