దైవదర్శనం : తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట!
తెలంగాణలో ప్రసిద్ది చెందిన వైష్ణవ క్షేత్రాలలో యదాద్రి ఆలయం ఒకటి. పరమభక్తుడు, పసివాడు అయిన ప్రహ్లాదుడిని కాపాడడం కోసం సాక్షాతూ మహావిష్ణువే ఉగ్రనరసింహుడిగా అవతారం ఎత్తాడు. అయన ఉగ్రరూపాన్ని చూడలేక శాంతించమని కోరితే లక్ష్మిసమేతంగా కొలువుదీరిన క్షేత్రమే ఈ యాదగిరిగుట్ట.. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్దికెక్కిన ఈ ఆలయ విశేషాలే ఈనాటి మన దైవదర్శనం!
స్థలపురాణం :
యాదాద్రి స్థలపురాణంకి సంబంధించిన ఓ కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహస్వామికి పరమభక్తుడు. అయితే అతనికి స్వామివారిని ప్రత్యేక్షంగా చూడాలని కోరిక పుట్టింది. అందుకోసం ఆంజనేయస్వామి సలహా మేరకు ఘోర తపస్సు చేశారు. అతని తపస్సుని మెచ్చి స్వామి ప్రత్యేక్షమయ్యారట.. అయితే ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని భక్తుడు కోరగా, స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శనం ఇచ్చాడట.
అప్పుడు స్వామివారిని అలాగే ఇక్కడే కొలువై ఉండమని కోరాడట.. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూఫాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడట. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రమని కూడా అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. అయితే ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరని భక్తులు చెప్తారు.
ఆలయ విశేషాలు :
1. యాదమహర్షి కోరిక మీదే శ్రీ ఆంజనేయస్వామి ఈ క్షేత్రంలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు.
2. ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు.
3. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులువినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట.
4. ఇక్కడ మెట్ల మార్గన వెళ్తుండగా, స్వయంభూగా వెలసిన శివలింగం కనిపిస్తుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా శివుడు వెలిశాడని చరిత్ర చెబుతుంది.
5 స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఈ మెట్లు ఎక్కి వెళ్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల ప్రగాడ విశ్వాసం.
6. ఈ ఆలయగర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము ఉంది. ఆ జలముతోనే నిత్యము స్వామివారికి అభిషేకం చేస్తారు.
7. ఇక్కడ నిత్యం సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతుండడం వలన ఈ క్షేత్రం మరో అన్నవరంగా పిలవబడుతుంది.
8. ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాడంగా జరుగుతాయి.
9. ఈ ఆలయంలో విష్ణుపుష్కరిణిని సాక్షాత్తూ బ్రహ్మా కడిగిన పాదలనుంచే ఉద్భవించిందని అంటారు. ఇందులో స్నానం చేసి స్వామి వారిని దర్శిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం!
10. ఈ ఆలయాన్ని మరింతగా డెవలప్ చేసేందుకు కృషి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ ఆలయ నిర్మాణం పూర్తి అయితే యాదగిరిగుట్ట దేశంలోనే అద్బుత ఆలయాల్లో ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com