అనంత వైసీపీలో అసమ్మతి సెగలు.. పెద్దిరెడ్డి మంత్రాంగం వికటించిందా?

అనంత వైసీపీలో అసమ్మతి సెగలు.. పెద్దిరెడ్డి మంత్రాంగం వికటించిందా?
అభివృద్ధిని పక్కనపెట్టి ఆధిపత్యం కోసం పోరాటం చేస్తుండటంతో పార్ట అభాసుపాలవుతోందని టాక్ వినిపిస్తోంది

అధికార వైసీపీలో అసమ్మతి స్వరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయా? పార్టీలో అసమ్మతి అధినేతకు వణుకు పుట్టిస్తోందా? అనంత జడ్పీటీసీల అసమ్మతి వెనుక ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారా? ఎమ్మెల్యేల ఫిర్యాదులను జడ్పీ ఛైర్మన్ పట్టించుకోవడంలేదా?

అధికార వైసీపీలో అసమ్మతి భగ్గుమంటోంది. అభివృద్ధిని పక్కనపెట్టి ఆధిపత్యం కోసం పోరాటం చేస్తుండటంతో పార్ట అభాసుపాలవుతోందని టాక్ వినిపిస్తోంది. ఏ స్థాయిలో చూసినా అసమ్మతి సెగలు పుట్టిస్తుండటంతో పార్టీ పెద్దల్లో వణికి పోతున్నట్లు సమాచారం. జడ్పీ సమావేశంలో జడ్పీటీసీలు అసమ్మతి గళం విన్పిస్తే అది కేవలం నిధుల విషయమే అనుకొన్నారు...కానీ అంతకు మించి జడ్సీటీసిల అసమ్మతి వెనుక ఏకంగా ఎమ్మెల్యేలే పావులు కదుపుతున్నారన్న సమాచారం జడ్పీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనంతపురం జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మపై ఉమ్మడి అనంతపురం జిల్లాలో మెజార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్పీ చైర్మన్ గా బోయ గిరిజమ్మ ఎంపిక ఎమ్మెల్యేలకు నచ్చలేదని టాక్ వినిపిస్తోంది. అయితే అప్పట్లో ముఖ్యమంత్రి హామీ మేరకు బోయ గిరిజమ్మ ఎంపిక సజావుగా సాగిపోయినా అసంతృప్తులకు నచ్చజెప్పడంతో అప్పట్లో వ్యవహారం సద్దుమణిగినట్లు ప్రచారం జరిగింది. అప్పటి నుండి నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి పదవీ కాలం సంవత్సరం పూర్తవడంతో లుకలుకలు ప్రారంభమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మెజార్టీ జడ్పీటీసీలు తమకు ఎలాంటి నిధులు కేటాయించకుండా...కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చారంటూ మండిపడుతున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు జడ్పీ సమావేశాలకు హాజరవుతున్నప్పటికీ జడ్పీటీసీలను మాత్రం కంట్రోల్ చేయకుండా వారి సమస్యలు వారు చెప్తున్నారంటూ జడ్పీచైర్మన్ పై పరోక్షంగా తమ అసమ్మతిని తెలియచేస్తూ వచ్చారు జిల్లా నేతలు. తాజాగా ఇటీవల జరిగిన బడ్జెట్ జడ్పీ సమావేశాల రోజు అసమ్మతి జడ్పిటీసిలను నచ్చచెప్పి ఆరోజు సమావేశాలు జరిగేలా చూశారు...కానీ ఆరోజు కూడా కొంతమంది జడ్పిటీసిలు వాకౌట్ చేసి తమ నిరసన తెలిపారు. ఇంఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన హామీ మేరకు జిల్లాకు వచ్చిమూడురోజుల పాటు మకాం వేసి అసమ్మతి నేతలతో మంత్రాంగం నడిపారు.

అదే సమయంలో జడ్పీ చైర్మన్ వ్యవహారశైలి కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.అప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఏడుగురు ఎమ్మెల్యేలు జడ్పీ ఛైర్మన్ వైఖరిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఎంపిడివోల బదిలీలు ఏకపక్షంగా జరగడమే కాకుండా, కారుణ్య నియామకాలు, నిధుల కేటాయింపులో తమకు కనీస సమాచారం ఇవ్వకుండానే జడ్పీ చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. జడ్పీ ఛైర్మన్ అసలు పట్టించుకోవడం లేదంటూ సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇంఛార్జ్ మంత్రి దృష్టికి కూడా ఇదే సమస్యలను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.ఒకవైపు ఎంఎల్ఏలు...మరోవైపు జడ్పిటీసిల అసమ్మతి జడ్పీ చైర్మన్ కు తలనొప్పిగా మారినట్లు అధికార పార్టీలో చర్చ నడుస్తోంది.

అయితే ఎవరు ఫిర్యాదు చేసినా తన పదవికి వచ్చిన ఢోకా లేదంటూ జడ్పి చైర్మన్ చేస్తున్న వ్యాఖ్యలతో అసమ్మతి నేతలు రగిలిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి జడ్పీ చైర్మన్ ఎంఎల్ఏల అసమ్మతిని ఏవిధంగా ఎదుర్కొంటారన్న చర్చ నడుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story