Telugu States : 34 కొత్త నియోజకవర్గాలు వస్తున్నాయ్!

తెలుగు రాష్ట్రాల్లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో శాసనసభ సభ స్థానాలు ప్రస్తుతం 119 ఉండగా ఆ సంఖ్య 34 పెరిగి 153 కానున్నాయని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 175 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 50 పెరిగి 225 కానున్నట్టు సమాచారం. 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల లోపు స్థానాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం గచ్చిబౌలిలో కొత్తగా నిర్మించిన పైవంతెన (ఫ్లై ఓవర్) ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించడంతో కొత్త నియోజక వర్గాలు ఏర్పాటవుతాయన్న నమ్మకం నాయకుల్లో కలిగించింది. ఒకప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏడు లక్షల మంది ఓటర్లు ఉండేవారని, ఖైరతాబాద్ నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా పఠాన్చెరు వరకు ఈ నియోకవర్గం విస్తరించి ఉండేదని, అయితే నియోజకవర్గాల పునర్విభజనలో ఖైరతాబాద్ ఏడు నియోజకవర్గాలుగా విడిపోయిందని ఆయన గుర్తు చేశారు. సనత్ నగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్ , శేర్ లింగంపల్లి, పఠాన్ చెరు, ఖైరతాబాద్ ఏర్పాటైన విషయాన్ని సీఎం రేవంత్ చెప్పారు. 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికీ శేరిలింగంపల్లి నియోజకవర్గం నాలుగు నియోజకవర్గాలు కానున్నట్టు ప్రకటించారు.
రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల శాసనసభ స్థానాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. జనాభా అంతకంతకు పెరిగిపోతున్న హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డి వంటి నగరాలు, పట్టణాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో ప్రస్తుతం 25 నియోజకవర్గాలుండగా.. ఆ సంఖ్య పునర్విభజనలో 12 నుంచి 15 నియోజకవర్గాలు పెరిగి 40 వరకు చేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. నగరానికి వలసలు భారీ ఎత్తున పెరగడం, కొత్త కాలనీలు ఏర్పాటు కావడంతో నగర జనాభా పెరుగుతోందని ప్రస్తుతం కోటి ఇరవై లక్షలున్న హైదరాబాద్ జనాభా వచ్చే నాలుగేళ్లలో కోటిన్నర వరకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నియోకవర్గాలు ఒక్కొక్కటి ఖచ్చితంగా రెండు నియోజకవర్గాలవుతాయని అంటున్నారు.
రంగారెడ్డి జిల్లాలో ఉన్న మహేశ్వరం నియోజకవర్గం శ్రీశైలం జాతీయ రహదారి నుంచి ప్రారంభమై తుక్కుగూడ, బాలాపూర్ ల మీదుగా ఉప్పల్ నియోకవర్గం సరిహద్దు టెలిఫోన్ కాలనీ వరకు విస్తరించి ఉండని రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట, నార్సింగ్, మణికొండల నుంచి షాద్ నగర్ శివార్ల వరకు ఉందని, ఇలా హైదరాబాద్ శివార్లలోని అన్ని నియోజకవర్గాలు భారీ జనాభా ఉండడంతో కొత్త అసెంబ్లీ సెగ్మెంట్లు ఇక్కడే ఎక్కువగా ఏర్పాటవుతాయని భావిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 45 శాతం పట్టణ జనాభా ఉన్నట్టు అధికార లెక్కలు చెబుతున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com