Godavari : బాసర వద్ద గోదావరికి పోటెత్తిన వరదలు.. స్థానికుల భయాందోళన..

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా బాసరలోని గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో స్థానికులలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే మొదటి ఘాట్ వద్ద ఉన్న పిండ ప్రధాన షెడ్డు పూర్తిగా నీట మునిగిపోయింది. కాగా ఈ వర్షాలు 1983లో వచ్చిన భారీ వరదలను గుర్తు చేస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా బాసరలోని పలు కాలనీలు ఇప్పటికే ముంపునకు గురయ్యాయి. గత అర్ధరాత్రి లోతట్టు ప్రాంతమైన హరిహర కాటేజీలో వరదల్లో చిక్కుకున్న 10 మందిని స్థానిక అధికారులు, గ్రామస్తులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం గోదావరి వరద ప్రవాహం ప్రధాన ఘాట్ మునగడానికి కేవలం ఒక మెట్టు మాత్రమే మిగిలి ఉండటంతో, పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వరద ప్రవాహం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com