Half-Day Schools : 15 నుంచి తెలంగాణ, ఏపీలో ఒంటిపూట బడులు

Half-Day Schools : 15 నుంచి తెలంగాణ, ఏపీలో ఒంటిపూట బడులు
X

వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. మార్చి 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు ఉంటాయని బుధవారం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ ఒకపూటే పనిచేయాల్సి ఉంటుంది. ఒంటి పూట బడుల ఆదేశాలు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు అన్నింటికీ వర్తించనున్నాయి. ఒంటిపూట బడుల సమయంలో పాఠశాలలు ఉదయం 8:00లకు ప్రారంభమవుతాయి, మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. ఉక్కపోత, వేడి గాలులకు విద్యార్థుల ఇబ్బందులు పడకుండా.. వారి సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒంటిపూట బడులు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత వేసవి సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి జూన్ 12 నుంచి 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వేసవి ప్రతాపం అధికంగా ఉంటోంది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక వడగాలులు ఈ నెల మూడో వారం నుంచి ప్రతాపం చూపించనున్నాయి.

Tags

Next Story