Heatstroke : వడదెబ్బ తగిలితే ఏం చేయాలి?

వడదెబ్బ తగిలితే బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దుస్తులు వదులు చేసి చన్నీళ్లతో శరీరాన్ని తడపాలని, ఇలా చేయడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోకుండా ఉంటాయని చెబుతున్నారు. బాధితుల చంకలు, గజ్జలు, మెడ వద్ద ఐస్ ప్యాక్‌లు ఉంచాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించాలని పేర్కొంటున్నారు.
మరవైపు ఎండలు మండిపోతున్నాయి. నిన్న 107 మండలాల్లో తీవ్ర వడగాలులు, 235 మండలాల్లో వడగాలులు వీచాయి. అత్యధికంగా మార్కాపురంలో 46 డిగ్రీలు, చాగలమర్రి, కలిగిరిలో 45.8 డిగ్రీలు, కాజీపేట, సింహాద్రిపురంలో 45.6 డిగ్రీలు, పంగులూరులో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో సగటున 40-44 డిగ్రీలతో భానుడు విజృంభించాడు.
ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆరుబయట స్థలాల్లో పనిచేసే కూలీలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యవసాయం, భవన నిర్మాణ పనులకు వెళ్లే వారు పనివేళలు మార్చుకోవాలని చెబుతున్నారు. గర్భిణులపైనా ఎండల ప్రభావం పడుతోందని, శరీరాన్ని చల్లబరిచే వ్యవస్థ దెబ్బతినకుండా తగిన రీతిలో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com