BY Elections : దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు..!

BY Elections : దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు..!
BY Elections : దేశవ్యాప్తంగా 29 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

దేశవ్యాప్తంగా 29 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా... బీజేపీ దాని మిత్ర పక్షాలు పూర్తి స్థాయిలో ఆధిక్యాన్ని కనబర్చాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ లో మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార బీజేపీకి ఎదురుగాలి వీచింది. మూడు అసెంబ్లీ సహా ఒక ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. మండీ లోక్ సభ స్థానంలో గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామ్ స్వరూప్ శర్మ గెలిచారు. ఐతే కరోనా కారణంగా మార్చిలో రామ్ స్వరూప్ శర్మ చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ పోటీలో ఉన్నారు. ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికలో సమీప బీజేపీ అభ్యర్థి కుషాల్ ఠాకూర్ పై ఆమె ఘన విజయం సాధించారు.

ఇక పశ్చిమ బెంగాల్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగగా...అన్ని స్థానాల్లో అధికార టీఎంసీ హవా కొనసాగింది. మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. మధ్యప్రదేశ్ లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగగా...రెండు స్థానాల్లో బీజేపీ, ఒక్క స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. మేఘాలయాలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగగా... ప్రాంతీయ పార్టీలైన NPP రెండు, UDP ఒక్కొ స్థానాన్ని గెలుచుకున్నాయి. బిహార్ లో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా...అధికార JDU ఒక స్థానం, ప్రతిపక్ష ఆర్జేడీ ఒక స్థానంలో గెలిచాయి.

ఇక రైతుల ఉద్యమానికి మద్దతుగా INLD లీడర్ అభయ్ సింగ్ చౌతాలా రాజీనామా చేయడంతో హర్యానాలో ఎల్లెనాబాద్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ జరిగిన ఉప ఎన్నికలో అభయ్ సింగ్ చౌతాలా... మరోసారి సత్తా చాటారు. ఇక కర్ణాటకలో సీఎం మార్పు తర్వాత తొలి సారి రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగగా... కాంగ్రెస్, బీజేపీ చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇక రాజస్థాన్ లో రెండు స్థానాలకు బై ఎలక్షన్ జరగగా... రెండు స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీ హస్తగతమయ్యాయి. దాద్రా నగర్ హవేలి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో శివసేన సత్తా చాటింది. ఇక మహారాష్ట్ర దెగ్లూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంది.

Tags

Read MoreRead Less
Next Story