ముంచుకొస్తున్న ముప్పు..వాటిపై దృష్టిపెట్టాలంటూ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

Coronavirus Represntional Image
Centre warns states: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ సంక్రమణ రేటు పెరుగుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. సంక్రమణ రేటు ఒకటి కంటే ఎక్కువ ఉంటే అది కొవిడ్ వ్యాప్తికి సంకేతమని చెప్పింది. కొవిడ్ నిబంధనలు పాటించేలా జిల్లా, స్ధానిక అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. ప్రజలు వైరస్ విషయంలో తేలిగ్గా వ్యవహరించొద్దని, హిల్ స్టేషన్స్‌లో రద్దీని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆయన లేఖ రాశారు.
కొన్ని రాష్ట్రాల్లో నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని.. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, మార్కెట్లు, ప్రజా రవాణా తదితర చోట్ల ఉల్లంఘన ఎక్కువగా ఉందని చెప్పారు. మార్కెట్ ప్రాంతాల్లో భారీగా గుమిగూడుతున్న ప్రజలు భౌతికదూరం నిబంధనలను పాటించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా సంక్రమణ రేటు పెరుగుతోందని.. రద్దీ ప్రాంతాలు, దుకాణాలు, మాల్స్, మార్కెట్లు, వాణిజ్య సముదాయాలు, వారపు సంతలు, రెస్టారెంట్లు, బార్లు, మండీలు, బస్టాండ్లు, రైల్వే ప్లాట్‌ఫామ్స్, పబ్లిక్ పార్కులు, జిమ్‌లు, వివాహ వేదికలు, స్టేడియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు తదితర చోట్ల కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూసే బాధ్యతలను అధికారులకు అప్పగించాలని ఆదేశించారు.
ఒకవేళ పరిశ్రమలు, ప్రాంగణాలు, మార్కెట్లలో కొవిడ్ నిబంధనలు అమలు చేయకపోతే అక్కడ ఆంక్షలు విధించాలన్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ ఇప్పటివరకూ ముగియలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పరీక్షలు ఇప్పటిలాగానే కొనసాగించాలని.. ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని చెప్పారు. ఇలాంటి విషయాల్లో ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా.. అందుకు సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని స్పష్టం చేశారు.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. గత 9 వారాల నుంచి గణనీయంగా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, గడచిన వారంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈనెల 5 నుంచి 11 వరకు కరోనాకు సంబంధించిన అత్యధిక కేసులు బ్రెజిల్, భారత్‌లలో నమోదయ్యాయని తెలిపింది. బ్రెజిల్‌లో 3 లక్షల 33 వేల కేసులు నమోదు కాగా, భారత్‌లో 2 లక్షల 91 వేల కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించింది. కరోనా ఆంక్షలు సడలించిన దేశాలలో కేసులు తిరిగి పెరుగుతున్నాయని, ఆయా ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com