మరోసారి కరోనా విజృంభణ.. కేసులు అదుపులోకి రాకపోతే మళ్లీ ఆంక్షలు

మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత మరోసారి కలవరపెడుతోంది. రెండు నెలల విరామం తర్వాత రోజువారీ కేసుల సంఖ్య ఒక్కసారిగా ఐదు వేలకు చేరింది. ముంబైతో పాటు విదర్భ, అమరావతి ప్రాంతాల్లో వైరస్ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. వైరస్ కట్టడి కోసం ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.
వైరస్ కట్టడికి ప్రజలు సహకరించకపోతే ముంబైలోనూ మరోసారి లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని నగర మేయర్ ఈ మధ్యే ప్రజలను హెచ్చరించారు. అటు... మహారాష్ట్రలోని పలువురు ప్రముఖులు వైరస్ బారినపడ్డారు.
తనకు వైరస్ నిర్ధారణ అయినట్టు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ థోప్ ట్విటర్‌లో వెల్లడించారు. ఇక మరోమంత్రి జయంత్ పాటిల్, రాజేంద్ర సింగ్నే, సహాయ మంత్రి ఓంప్రకాశ్ బాబారావ్ తమకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. ప్రస్తుతం తమ అరోగ్యం బాగానే ఉందని తెలిపారు.
2019 చివరిలో మొదటిసారి చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ అనతి కాలంలోనే ప్రపంచాన్ని గడగడలాడించింది. లాక్‌డౌన్లు, కట్టుదిట్టమైన చర్యలు, అనే వ్యయప్రాయాసలతో పూర్తిగా నివారించలేకపోయినా కాస్తంత ఊపిరి పీల్చుకునే పరిస్థితులు అయితే వచ్చాయనే చెప్పొచ్చు. అయితే కోవిడ్ నియంత్రణలోకి వస్తుందనుకునే తరుణంలో కొత్తతరం కరోనా వైరస్‌లు మరింత కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికా, బ్రిటన్ దేశాల్లో కొత్త రకం కరోనా కేసులు నమోదు కావడం తెలిసిందే. తాజాగా జపాన్‌లో మరో కొత్త రకం కరోనాను గుర్తించారు.
జపాన్‌లోని కాంటే ప్రాంతంలో కొత్త రకం మహమ్మారిని గుర్తించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. కాంటే ప్రాంతంలో 91 కేసులు, విమానాశ్రయాల్లో రెండు కేసులు నమోదు అయినట్లు వారు పేర్కొన్నారు. అయితే వైరస్ నియంత్రణకు టోక్యో ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఇన్ఫెక్షన్ క్లస్టర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కొత్త వైరస్ వేరే దేశాల్లో ఉత్పన్నమై ఉంటుందని వైద్యాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌లో వ్యాక్సిన్ పనితీరును దెబ్బతీసే ఈ484కె మ్యుటేషన్‌ను ఇందులో గుర్తించినట్టు తెలుస్తోంది. కొత్త వైరస్ త్వరగా వ్యాపించవచ్చేలా ఉందని శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com