కరోనాతో పోల్చితే కొత్త రకం వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం!

ప్రపంచ దేశాలను భయపెడుతోన్న స్ట్రెయిన్ వైరస్ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. బ్రిటన్ నుంచి రాజమహేంద్రవరానికి వచ్చిన మహిళలో మాత్రమే కొత్త రకం కరోనా వైరస్‌ను గుర్తించామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఆమె నుంచి ఇతరులకు వైరస్ సోకలేదని స్పష్టం చేసింది. బ్రిటన్ నుంచి ఏపీకి వచ్చిన 1,423 మందిలో 1,406 మందిని గుర్తించామన్న ఏపీ ప్రభుత్వం.. వారిలో 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణయింది. వీరి నుంచి మరో 12 మందికి వైరస్ సోకింది. మొత్తం 24 మంది నమూనాలను సీసీఎంబీకి పంపగా రాజమహేంద్రవరానికి చెందిన మహిళకు యూకే స్ట్రెయిన్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మిగతా 23 మందికి సంబంధించిన నివేదికలు సీసీఎంబీ నుంచి రావాల్సి ఉంది.
తెలంగాణలో రెండో యూకే వైరస్ కేసు నిర్ధారణ అయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓ మహిళకు ఈ వైరస్ సోకినట్టు సీసీఎంబీ నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే వరంగల్ వాసిలో కొత్త వైరస్ ఉన్నట్టు తేలింది. తాజా ఫలితంతో రెండో కేసు నమోదైనట్లయింది. ఈ నేపథ్యంలో పాజిటివ్ వ్యక్తుల సన్నిహితులను గుర్తించడంపై తెలంగాణ ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. బ్రిటన్ ప్రయాణికుల్లో పాజిటివ్ వచ్చిన బాధితులకు చికిత్స అందించడం కోసం గచ్చిబౌలిలోని టిమ్స్‌లో మూడంతస్తులు కేటాయించారు. రాష్ట్రంలోని ఇతర ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉంచారు.
బ్రిటన్ నుంచి తమిళనాడుకు వచ్చిన ఒకరికి కొత్తరకం కరోనా వైరస్ సోకినట్లు ఆ రాష్ట్రం ప్రకటించింది. యూకే నుంచి వచ్చిన 17 మందికి పాజిటివ్ రాగా, వారిలో ఒకరికి కొత్త వైరస్ బయటపడింది. కర్నాటకలో ముగ్గురికి కొత్త రకం వైరస్ సోకింది. బెంగళూరులోని ఉత్తరహళ్లి వాసులు ఇద్దరు, జేపీ నగరలోని ఒకరికి కొత్త వైరస్ సోకినట్లు కర్ణాటక వైద్యారోగ్యశాఖ అధికారులు గుర్తించారు.
స్ట్రెయిన్ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 18, 19 కేసులు గుర్తించినట్టు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్స్ ప్రకటించాయి. అయితే కేంద్ర వైద్యారోగ్యశాఖ మాత్రం కొత్త వైరస్ సోకిన వారిలో ఆరుగుర్ని గుర్తించినట్టు తెలిపింది. మిగిలిన వారు ఎవరు, ఎక్కడి వారనే విషయాన్ని బయటకు చెప్పలేదు. బెంగళూరులోని నిమ్హాన్స్ ప్రయోగశాలలో మూడు, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో రెండు, పుణెలోని ఎన్‌ఐవీలో ఒక కేసు నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. సీసీఎంబీ మాత్రం తాము మూడు కొత్త వైరస్ కేసుల్ని గుర్తించినట్లు చెబుతోంది.
బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో.. కొత్త వైరస్ 23 ఉత్పరివర్తనాలు చెందినట్టు తేలింది. కొత్త పరివర్తనాన్ని N501Yగా గుర్తించారు. అటు బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా సోకిన 40 మంది నమూనాలను సీసీఎంబీ పరీక్షించింది. 20 నమూనాల తాలూకూ జన్యుక్రమాన్ని కనుగొనగా, ముగ్గురిలో కొత్త వైరస్ B117 ఉన్నట్లు గుర్తించామని సీసీఎంబీ తెలిపింది. దీని వ్యాప్తిని వైద్యారోగ్యశాఖ నిత్యం పర్యవేక్షిస్తోంది. వైరస్ సోకిన వారిని గుర్తించడంతోపాటు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది.
కరోనాతో పోల్చితే కొత్త రకం వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలు యూకేకు విమానసర్వీసులు నిలిపివేశాయి. నవంబరు 25 నుంచి డిసెంబరు 23 అర్ధరాత్రిలోగా భారత్‌కు చేరుకున్న 33 వేలమంది ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 114 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. బాధితులకు సోకింది కొత్త రకమా కాదా అన్నది తెలుసుకునేందుకు వారి రక్తనమూనాలను దేశంలోని పది వైరాలజీ ప్రయోగశాలలకు పంపించారు.
దేశంలో బయటపడిన వైరస్ రకం కొత్తదే అయినా తీవ్రత, లక్షణాలన్నీ పాతవేనని సీసీఎంబీ చెబుతోంది. టీకా అభివృద్ధికి ఇవేమీ అడ్డంకి కాదని, పాత వాటి కంటే కొత్త వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున నివారణకు మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com