విజయవంతంగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్

విజయవంతంగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు చేసిన కరోనా టెస్టుల సంఖ్య 20 కోట్ల మైలు రాయిని దాటిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 13 నుంచి రెండో డోసు వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభంకాగా.. తొలి డోసు తీసుకున్న వ్యక్తులకు 28 రోజులు తర్వాత రెండో డోసు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో వచ్చే శనివారం నుంచి రెండో డోసు వేసే కార్యక్రమం చేపట్టినట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 60 శాతం మేర ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ ఇచ్చామని పేర్కొంది. ఫిబ్రవరి 20లోపు మిగిలిన ఆరోగ్య కార్యకర్తలకూ వ్యాక్సిన్‌ అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. మార్చి 6లోపు ఇతర ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమం చేపట్టాలంది.

కరోనా వైరస్‌ టెస్టుల్లో భారత్‌ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు చేసిన కరోనా టెస్టుల సంఖ్య 20 కోట్ల మైలు రాయిని దాటిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. టెస్టుల సంఖ్య పెరగడం వల్ల కరోనా క్యుములేటివ్‌ పాజిటివిటీ రేటు 5.39శాతానికి చేరిందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1.48లక్షలకు చేరిందని.. గత ఎనిమిది నెలల్లో దేశంలోని యాక్టివ్‌ కేసులు ఇదే అత్యల్పమని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 95 మంది కరోనా కారణంగా మరణించారని చెప్పింది. మరోవైపు దేశవ్యాప్తంగా టీకా వేయించుకున్న వారి సంఖ్య 54 లక్షలకు చేరినట్లు పేర్కొంది. అత్యంత వేగంగా కేవలం 21 రోజుల్లోనే ఐదు మిలియన్ల మంది టీకా తీసుకున్న దేశంగానూ భారత్‌ రికార్డు సృష్టించిందని ప్రకటించింది.

ఇక కరోనా వైరస్ విజృంభణను కట్టడి చేయడంలో భారత్‌ చెప్పుకోదగ్గ పురోగతి సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ప్రశంసించారు. మరోవైపు భారత్‌లో తయారవుతున్న కరోనా టీకా కోసం మరో 25 దేశాలు వరసలో ఉన్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్ అన్నారు. ఇప్పటికే సుమారు 15 దేశాలకు టీకాలు సరఫరా చేసినట్లు వెల్లడించారు. గ్రాంట్ రూపంలో కొన్ని పేద దేశాలకు టీకాలను సరఫరా చేస్తున్నామని తెలిపారు. మరికొన్ని దేశాలు ఔషధ సంస్థలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం టీకా పంపిణీ జరుగుతోందన్నారు.


Tags

Read MoreRead Less
Next Story