AP Government: ఉమ్మడి ఆస్తులు పంచాలి.. కోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్

AP Government: ఉమ్మడి ఆస్తులు పంచాలి.. కోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్
AP Government: ఉమ్మడి ఆస్తులున్నాయన్న విషయం జగన్‌ సర్కార్‌కు ఇప్పుడు గుర్తొచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాక ఆస్తులు పంచేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది జగన్‌ సర్కార్‌.

AP Government: ఉమ్మడి ఆస్తులున్నాయన్న విషయం జగన్‌ సర్కార్‌కు ఇప్పుడు గుర్తొచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాక ఆస్తులు పంచేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది జగన్‌ సర్కార్‌. రాష్ట్ర విభజన తర్వాత ఆస్తులు పంచలేదని కోర్టుకు తెలిపింది. తెలంగాణలోనే లక్షా 42 వేల కోట్ల ఆస్తులు ఆస్తులున్నాయని అందులో 91 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయంటూ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏనాడూ ఆస్తుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు ఏకంగా, అత్యవసరమన్నట్లుగా సుప్రీం మెట్లు ఎక్కడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఏపీ సర్కార్ సుప్రీంను ఆశ్రయించిందా...లేక ఇందులో కూడా ఏమైనా రాజకీయ కోణం ఉందా అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.



రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు దాటింది. ఏపీ రీ-ఆర్గనైజేషన్‌ యాక్ట్‌లోని షెడ్యూల్‌ 9లో 91 సంస్థలు, షెడ్యూల్‌ 10 లో 142 సంస్థలతో పాటు మరో 12 సంస్థల ఆస్తులు, అప్పులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. సంస్థలతో పాటు పంపిణీ చేయాల్సిన ఆస్తుల విలువ దాదాపు లక్షా 42 వేల 601 కోట్ల రూపాయలుగా ఉంది. ఇందులో 91 శాతం ఆస్తులు హైదరాబాద్‌ మహానగరంలోనే ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం ఆస్తుల పంపిణీలో కేంద్రం పెద్దన్నపాత్ర పోషించాలి. ఐతే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలే చర్చాల ద్వారా విభజన అంశాలపై తేల్చుకోవాలని కేంద్రం పలుమార్లు సలహాలిచ్చింది.పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు సైతం ఇదే సలహా ఇచ్చింది. ఐతే ఈ సలహాను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో వివాదాలు కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఈ మూడున్నరేళ్లలో జగన్‌ ఈ అంశంపై ఏనాడూ దృష్టి పెట్టలేదు.



ఆస్తుల పంపిణీపై అధికారులతో ఏనాడూ జగన్‌ సమీక్షలు నిర్వహించలేదు. తెలంగాణకు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసి..ఏపీకి దక్కాల్సిన ఆస్తుల గురించి చర్చించలేదు. సాగునీటి ప్రాజెక్టులపై ఒకటి, రెండు సార్లు హైదరాబాద్‌లో సీఎంల సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాల అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ...ఆస్తుల పంపిణీ అంశం చర్చకు రాలేదు. ఈ విషయంలో జగన్‌ సర్కారు ఏనాడూ చొరవ తీసుకోలేదు. కనీసం తన మంత్రులనైనా చర్చలకు పంపలేదు. ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి..చొరవ తీసుకుని వాటిని తెచ్చుకోవాల్సింది ఏపీనే అభిప్రాయం వినబడుతోంది. ఏపీనే పెద్దగా పట్టించుకోనప్పుడు..కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుంది. చర్చలే జరగనప్పుడు సమస్యలు ఎలా పరిష్కారమవుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఐతే ఉన్నట్టుండి ఇప్పుడు కోర్టును ఆశ్రయించడంలో ఏదో మతలబు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



మరోవైపు తెలంగాణలో పొలిటికల్ హాటీ పెరిగింది.అధికార టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా మారింది. మరో ఏడాదిలో తెలంగాణలో ఎన్నికలున్నాయి. ఆ పార్టీ మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను బలంగా నమ్ముకుంది. ఈ నేపథ్యంలో మొన్న మళ్లీ కలిసిపోవడానికే మా ఓటు అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మంత్రులు మండిపడ్డారు. అయితే...ఈ వ్యాఖ్యలు బూమరాంగ్‌ కావడంతో సజ్జల తన కామెంట్స్‌పై ఏదో వివరణ ఇచ్చారు.



ఈ సారి జగన్ సర్కార్‌ ఆస్తుల పంపిణీ అంశాన్ని తెరపైకి తెచ్చింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనివల్ల రెండు లాభాలున్నాయని భావిస్తున్నారు. ఒకటి...రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని, ఆస్తుల కోసం ఏకంగా సుప్రీంకోర్టులోనే న్యాయ పోరాటం చేస్తున్నామని ప్రజలకు చెప్పుకోవడం కాగా..ఇక రెండోది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌కు బలమైన సెంటిమెంట్‌ అస్త్రాన్ని అందించడమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఆస్తులను తీసుకెళ్లేందుకు ఏపీ సర్కారు సుప్రీం కోర్టులో కేసు వేసిందంటూ సహజంగానే సెంటిమెంట్‌ రాజేస్తారని, ఇప్పటికే దీనికి తెలంగాణలో చాలా గట్టి ప్రాతిపదికనే సిద్ధం చేశారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ప్రయోజనాల కోసం వేసిన కేసు అంతిమ ఉద్దేశం రాజకీయంగా తనకు మిత్రుడైన కేసీఆర్‌కు మేలు చేయడమేనని భావిస్తున్నారు. ఈ డ్రామాను రక్తికట్టించేందుకు ఏపీలో కూడా ఆస్తుల పంపిణీ పేరిట ఆందోళనలు, ఉద్యమాలు పుట్టించవచ్చునని కూడా అనుమానిస్తున్నారు.



ఏపీ ప్రయోజనాలకు సంబంధించి జగన్‌ సర్కారుది సరెండర్‌ - సైలెంట్‌ పాలసీయేనంటూ విమర్శలు ఉన్నాయి. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి దక్కాల్సిన నిధుల విషయంలో తెలంగాణ సర్కారుతో పోరాడింది. కార్మిక శాఖ ఉమ్మడి నిధులను కేసీఆర్‌ సర్కారు తరలిస్తుండటంతో... మొత్తం నిధులను విజయవాడలోని బ్యాంకు ఖాతాకు మళ్లించారు. ఇంటర్మీడియట్‌ బోర్డు నిధుల విషయంలో సుప్రీంకోర్టు దాకా వెళ్లి పోరాడారు. విభజన తర్వాత పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున...చాలా ప్రభుత్వ భవనాలను ఏపీకి కేటాయించారు. సచివాలయం, బూర్గుల రామకృష్ణారావు భవన్‌, ఇరిగేషన్‌, మునిసిపల్‌ డెవల్‌పమెంట్‌ సహా అనేక బిల్డింగ్స్‌ ఏపీ ఆధీనంలో ఉన్నాయి. వాటిని తమకు అప్పగించాలని కేసీఆర్‌ సర్కారు కోరినప్పటికీ.. ఆస్తుల విభజన అంశం తేలకుండా, భవనాలపై హక్కులు వదులుకోవడం సరికాదని చంద్రబాబు సర్కారు భావిస్తూ వచ్చింది. ఆస్తుల విభజనపై కేంద్రం నియమించిన షీలాబేడీ కమిటీ...ఎన్నికలకు కొన్ని నెలల ముందు నివేదిక సమర్పించింది. ఈ కమిటీనిగానీ, నివేదికనుగానీ తెలంగాణ సర్కారు గుర్తించలేదు. ఈ నేపథ్యంలో... ఆస్తుల పంపిణీకి తెలంగాణను ఒప్పించేలా, ప్రభుత్వ భవనాల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.



కానీ... జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన నెలరోజులకే మొత్తం హైదరాబాద్‌లోని భవనాలపై హక్కును వదులుకున్నారు. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌తోపాటు మరొక్క భవనం మాత్రం చాలునని లిఖితపూర్వకంగా చెప్పేశారు. దీంతో... ఆస్తుల విభజన విషయంలో తెలంగాణపై ఒత్తిడి తెచ్చేందుకు ఎలాంటి అస్త్రమూ లేకుండా పోయింది. ఇలా అన్నీ వదులుకుని, మూడున్నరేళ్లు మౌనంగా ఉన్న జగన్‌ సర్కార్‌... ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దీంతో జగన్‌ సర్కార్‌ విశ్వసనీయపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story