దేశంలో లాక్‌డౌన్‌కు ఏడాది పూర్తి.. మళ్లీ లాక్‌డౌన్ దిశగా ప్రధాన నగరాలు

యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశంలో తొలిసారి లాక్‌డౌన్ విధించి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. కరోనా గొలుసును తెంచేందుకు గతేడాది మార్చి 22న ప్రధాని మోదీ.. 14 గంటలపాటు జనతా కర్ఫ్యూ ప్రకటించారు. ఆ తర్వాత మార్చి 25 నుంచి 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. నాలుగు విడతల్లో లాక్‌డౌన్‌ను విధించింది కేంద్రం. దీంతో జనజీవనం స్తంభించి పోయింది. అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ, ప్రైవేట్, వాణిజ్య సంస్థలన్నీ మూతపడ్డాయి. ప్రజారవాణా నిలిచిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పట్టణాల్లో వలస కార్మికులకు ఉపాధి కరువయ్యింది. దీంతో లక్షలాది మంది కూలీలు సొంతూళ్లకు కాలినడకన పయనమయ్యారు. ఆహారం, నీరు లేక వందలాదిమంది మధ్యలోనే మృత్యువాతపడ్డారు.
దాదాపు 75 రోజుల లాక్‌డౌన్ అనంతరం కేంద్రం క్రమంగా అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించింది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థికవ్యవస్థ కుదేలైన నేపథ్యంలో తిరిగి దాన్ని గాడిన పెట్టేందుకు ఒక్కో రంగానికి సడలింపులు ప్రకటించింది. ఇందులో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా మందిరాలు తిరిగి తెరుచుకున్నాయి. దేశీయ విమాన సర్వీసులు, రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారికి తొలుత చికిత్సా విధానం, వ్యాక్సిన్ లేకపోవడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. రోగులకు చికిత్సనందిస్తూ ఎంతోమంది వైద్యులు వైరస్‌కు బలయ్యారు. ఇప్పటివరకు దేశంలో కోటీ 17లక్షల మందికి వైరస్ సోకగా.. లక్షా 60 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు.
అయితే వైరస్ సమసిపోయిందని ప్రజలు భావించడం, వ్యాక్సిన్ వచ్చిందన్న అతివిశ్వాసం, కరోనా మార్గదర్శకాలు పాటించడకుండా నిర్లక్ష్యం వహించడంతో కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తున్నది. ప్రస్తుతం రోజుకు సగటున 45 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైరస్ కట్టడికి మళ్లీ లాక్‌డౌన్ విధించే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోతే చర్యలు కఠినంగా ఉంటాయని... భారీగా జరిమానాలు విధిస్తామని ప్రకటనలు చేస్తున్నాయి. అయినా.. ప్రజలు మాత్రం తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం మరింత ఆందోళన కల్గిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com