TGPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో జాబ్ క్యాలెండర్

2 వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్-1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీసులు, వైద్య నియామకాల బోర్డుల, ఇతర విభాగాల పోస్టులను ఇందులో పొందుపరచనుంది. నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాల తేదీలు స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తుదిరూపు తీసుకురాగా.. సీఎం రేవంత్ పరిశీలన అనంతరం విడుదల చేసేందుకు అడుగులు ముందుకేస్తోంది.
2022 నుంచి టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు 27 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో పేపర్ల లీకేజీలతో 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయ్యాయి. అప్పుడు నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఒక్కటి కూడా వెల్లడి కాలేదు. గత ప్రభుత్వ హయాంలో వివిధ రిక్రూట్మెంట్బోర్డుల పరిధిలో ప్రధాన అడ్డంకిగా మారిన కోర్టు కేసుల చిక్కుముడులన్నింటినీ ఒక్కటొక్కటిగా అధిగమించిన ప్రభుత్వం.. ఆ ఫలితాలను కూడా ప్రకటించింది.
రాష్ట్రంలో కీలకమైన ఉద్యోగాలన్నింటీనీ టీజీపీఎస్సీ చేపడుతోంది. దీంతో పాటు పోలీసు నియామకాలకు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, గురుకుల టీచర్, సిబ్బంది పోస్టులను రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్‌బోర్డు (టీఆర్ఈఐఆర్బీ), టీచర్ల నియామకాలను విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఖాళీలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) చేపడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com