TS Group-1 Hall Tickets : జూన్ 1న గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9వ తేదీన తిరిగి నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు టిజిపిఎస్‌సి వెల్లడించింది. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది.
గతంలో ఎదురైన సంఘటనలు, న్యాయవివాదాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా కఠిన నిబంధనలతో పరీక్ష నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభం కానుండగా, అభ్యర్థులను గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నట్లు టిజిపిఎస్‌సి తెలిపింది. పరీక్షా సమయానికి అరగంట ముందు ఉదయం 10 గంటలకు గేట్లు మూసివేయనున్నట్లు పేర్కొంది.
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు ఈసారి అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు ముద్రించిన ఒఎంఆర్ షీట్‌ను అందించనున్నారు. అభ్యర్థులు ఒఎంఆర్ షీట్‌లో ఉన్న నిబంధనలు పాటించాలని టిజిపిఎస్‌సి స్పష్టం చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నమూనా ఒఎంఆర్ షీట్‌ను టిజిపిఎస్‌సి అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు చేసే పొరపాట్లకు కమిషన్ బాధ్యత వహించదని టిజిపిఎస్‌సి తెలిపింది. ఈ పరీక్షలో అభ్యర్థులకు బయోమెట్రిక్ వివరాలు తీసుకోనున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఉదయం 9.30 గంటల నుంచి బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలు ప్రారంభిస్తారని తెలిపింది. బయోమెట్రిక్ వివరాలు ఇవ్వని అభ్యర్థుల ఒఎంఆర్ షీట్‌ను మూల్యాంకనం చేయమని కమిషన్ స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com