2000 Notes : రూ.2 వేల నోట్లు 97% తిరిగివచ్చాయి: ఆర్బీఐ

2000 Notes : రూ.2 వేల  నోట్లు 97% తిరిగివచ్చాయి: ఆర్బీఐ

రద్దు చేసిన రూ.2వేల నోట్లలో ఇప్పటివరకు 97.69% బ్యాంకులకు తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. ఇంకా రూ.8,202 కోట్లు తిరిగి రావాల్సి ఉందని తెలిపింది. గత ఏడాది మే 19న రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అప్పుడు 3.56 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు చలామణిలో ఉండేవి.

రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు, మార్చుకునేందుకు ఆర్బీఐ పలు విడతలుగా వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం దేశంలోని 19 ఆర్బీఐ కేంద్రాల్లో వీటిని మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, ముంబై, నాగపూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం, రాంచీ, రాయపూర్ ఆర్బీఐ కేంద్రాల వద్ద మాత్రమే ప్రస్తుతం 2 వేల నోట్ల ఎక్స్ఛేంజ్ జరుగుతోంది.

2016, నవంబర్ లో పెద్ద నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ. 2000, రూ. 500 కొత్త నోట్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు రూ.2 వేల నోట్లను సైతం ఉపసంహరించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story