Mukesh Ambani : ఆఫ్రికా మార్కెట్ పై అంబానీ గురి..నైజీరియా దిగ్గజంతో రిలయన్స్ మహా ఒప్పందం.

Mukesh Ambani : ఆఫ్రికా మార్కెట్ పై అంబానీ గురి..నైజీరియా దిగ్గజంతో రిలయన్స్ మహా ఒప్పందం.
X

Mukesh Ambani : భారతీయ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇప్పుడు ఆఫ్రికా ఖండంపై కన్నేశారు. రిలయన్స్ రిటైల్ విభాగంలోని ఎఫ్ఎంసీజీ కంపెనీ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, నైజీరియాకు చెందిన ప్రముఖ ట్రోపికల్ జనరల్ ఇన్వెస్ట్‌మెంట్స్ గ్రూప్‌తో చేతులు కలిపింది. ఈ మేరకు ఇరు కంపెనీలు ఒక భారీ జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ద్వారా ఆఫ్రికాలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో ఒకటైన నైజీరియాలోకి రిలయన్స్ తన ఉత్పత్తులను నేరుగా ప్రవేశపెట్టబోతోంది. ఈ జాయింట్ వెంచర్‌లో రిలయన్స్ మెజారిటీ వాటాను కలిగి ఉండటం విశేషం.

రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇప్పటికే మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా దేశాల్లో తన ఉనికిని చాటుకుంది. అయితే ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో తన పట్టును పెంచుకోవడానికి నైజీరియాను ఒక గేట్‌వేలా వాడుకోవాలని అంబానీ ప్లాన్ చేస్తున్నారు. నైజీరియాలో టీజీఐ గ్రూప్‌కు ఉన్న భారీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, తయారీ అనుభవాన్ని రిలయన్స్ ఉపయోగించుకోనుంది. దీనివల్ల భారతీయ బ్రాండ్లయిన కాంపా కోలా, ఇండపెండెన్స్ వంటి ఉత్పత్తులు ఇప్పుడు నైజీరియాలోని మారుమూల పల్లెలకు కూడా చేరువయ్యే అవకాశం ఉంది. ప్రపంచ స్థాయి నాణ్యమైన ఉత్పత్తులను సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలకే అందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది.

నైజీరియా మార్కెట్లో టీజీఐ గ్రూప్ అనేది ఒక పెద్ద బ్రాండ్. వీరికి ఆహార పదార్థాలు, గృహోపకరణాలు, పారిశ్రామిక రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్ వంటి విభిన్న రంగాల్లో అపారమైన అనుభవం ఉంది. ప్రతిరోజూ లక్షలాది మంది వినియోగదారులు టీజీఐ ఉత్పత్తులను వాడుతుంటారు. రిలయన్స్‌తో ఈ భాగస్వామ్యం గురించి టీజీఐ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ సవారా మాట్లాడుతూ.. పశ్చిమ ఆఫ్రికాలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి రిలయన్స్‌తో కలవడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో నైజీరియా ఒకటని, అంబానీ అండతో తాము మరింత ఎత్తుకు ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు.

కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా, ప్రపంచంలోనే అత్యుత్తమ ఎఫ్ఎంసీజీ కంపెనీగా ఎదగాలన్నది రిలయన్స్ లక్ష్యం. ఆర్‌సీపీఎల్ డైరెక్టర్ టి.కృష్ణకుమార్ ఈ ఒప్పందాన్ని ఒక మైలురాయిగా అభివర్ణించారు. ఆఫ్రికన్ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తమ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించబోతున్నామని ఆయన తెలిపారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా కేవలం ఉత్పత్తుల అమ్మకాలే కాకుండా, ఆఫ్రికాలో పండిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఒక శక్తివంతమైన ఎగుమతి వేదికను కూడా నిర్మించబోతున్నారు.

నైజీరియా జనాభా, పెరుగుతున్న కొనుగోలు శక్తిని దృష్టిలో పెట్టుకుంటే, అంబానీ ఎంట్రీ అక్కడ పెను మార్పులకు దారితీయవచ్చు. నాణ్యమైన వస్తువుల కోసం ఎదురుచూస్తున్న ఆఫ్రికన్ ప్రజలకు రిలయన్స్ ప్రొడక్ట్స్ ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారుతాయి. రిలయన్స్ తన అడ్వాన్సుడ్ టెక్నాలజీ, సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌ను ఇక్కడ ఉపయోగిస్తుంది. వచ్చే కొద్ది నెలల్లోనే ఈ జాయింట్ వెంచర్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆఫ్రికా మార్కెట్లోకి చైనా కంపెనీలు చొచ్చుకొస్తుండగా, అంబానీ ఎంట్రీతో భారతీయ కంపెనీల హవా అక్కడ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags

Next Story