Amit Shah : అమిత్ షా తిట్టలేదు.. క్లారిటీ ఇచ్చిన తమిళిసై

తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ ( Tamilisai Soundararajan ) తనతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) కఠినంగా మాట్లాడుతున్నట్లు కనిపించిన వైరల్ వీడియోపై వస్తున్న ఊహాగానాలపై స్పష్టత ఇచ్చారు. వీడియో వైరల్ అయిందనీ..అమిత్ షా చర్య తప్పుగా అంచనా వేశారని ఆమె అన్నారు. రాజకీయ, నియోజకవర్గ కార్యక్రమాలను స్పీడప్ చేయాలని అమిత్ షా తనకు సలహా ఇచ్చారని సౌందరరాజన్ చెప్పుకొచ్చారు.
''లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీలో జరిగిన కార్యక్రమంలో తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను. పోలింగ్ సరళి, ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలుసుకునేందుకు అమిత్ షా నన్ను పిలిచారు. నేను ఆయనకు వివరిస్తున్నప్పుడు టైం లేదు కాబట్టి అలా మాట్లాడారు. రాజకీయ, నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని సలహా ఇచ్చారు. అమిత్ షా సూచన నాకు ఎంతో భరోసా కలిగించింది. జరిగింది ఇదీ' అని తమిళిసై తెలిపారు.
తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయంపై అక్కడి పార్టీ చీఫ్ కె అన్నామలైని సౌందరరాజన్ విమర్శించారు. ఆమె వ్యాఖ్యలపై అమిత్ షా సీరియస్ గా స్పందించి తమిళిసైకి వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు షికారు చేశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com