Amit Shah : సొంత కారు లేని అమిత్ షా!

ఎన్నికల బరిలో దిగుతున్న బడా రాజకీయ నేతల నామినేషన్లలో తమ ఆస్తులు వివరాలు క్లియర్ గా ఇస్తుంటారు. ఈ డీటెయిల్స్ పై అంతటా ఆసక్తి ఉంటుంది. గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా శుక్రవారం రోజున నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఆస్తుల వివరాలను వెల్లడించారు.
ఈ డీటెయిల్స్ ప్రకారం అమిత్ షాకు మొత్తం రూ.36 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయి. తనకు సొంత కారు లేదని నామినేషన్ పేపర్లలో అమిత్ షా చెప్పారు. అమిత్ షాకు రూ.20 కోట్ల చర, రూ.16 కోట్ల స్థిరాస్తులు ఉండగా.. తన భార్య సోనాల్‌కు రూ.31 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. షాకు రూ.72 లక్షల విలువైన ఆభరణాలు, ఆయన సతీమణికి రూ.1.10 కోట్ల విలువైన నగలు, అమిత్ షా పేరు మీద రూ.15.77లక్షల రుణం, సోనాల్ పేరు మీద రూ. 26.32లక్షల రుణం ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
వృత్తి రీత్యా తాను రైతునని, సామాజిక కార్యకర్తనని వెల్లడించారు షా. తనపై మూడు క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలిపారు. అమిత్ షా ఎంపీగా వేతనం అందుతోంది. భూమి, ఇంటి అద్దెలు, వ్యవసాయం, షేర్లు, డివిడెండ్ల నుంచి తనకు ఆదాయం వస్తున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు కేంద్ర హోంశాఖ మంత్రి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com