Permanent : పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాల్.. స్పీకర్ ఓకే

Permanent : పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాల్.. స్పీకర్ ఓకే
X

పార్లమెంటులో శాశ్వత అరకు కాఫీ స్టాల్ ను ఏర్పాటు చేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పీకర్ ఓం బిర్లా సుముఖత వ్యక్తం చేశారని కేంద్రమంత్రి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ లో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్ప గిరిజన వారసత్వం, సేంద్రీయ వ్యవసాయంకు చిహ్నంగా అరకు కాఫీ ఉన్నదని తెలిపారు. మంగళవారం అరకు కాఫీ ప్రచారం పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఇందుకు సంబంధించిన వినతి పత్రాన్ని అందజేశారు. అందులో అరకు కాఫీ గొప్పతనాన్ని తెలుపుతూ, ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వెల్లడించారు. అలాగే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సహా పలు ముఖ్య సందర్భాలలో అరకు కాఫీ విశిష్టతను పొగిడారని గుర్తు చేశారు.

పార్లమెంటులో అరకు కాఫీ ప్రచారం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేయడంతో పాటు అరకు కాఫీ కోసం శాశ్వతంగా ఒక స్టాల్ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే తోటి పార్లమెంట్ సభ్యులు, ప్రముఖులను ఈ కాఫీ ప్రత్యేకమైన రుచులకు దగ్గరగా తీసుకురావాలని మా ప్రయత్నం అని వివరించారు. ఇక ఈ విషయంపై స్పీకర్ ఓం బిర్లా సానుకూలంగా స్పందించి, ప్రత్యేక చొరవతో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలలోనే ప్రారంభించేలా కృషి చేస్తాము అని హామీ ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, తాము గిరిజనుల అభివృద్ధికి, అరకు కాఫీని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టు కున్నాము అని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Tags

Next Story