Karnataka CM : ఎస్ఎం కృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ప్రముఖుల నివాళులు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్‌లో తుదిశ్వాస విడిచారు. ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కృష్ణ.. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. తన హయాంలో బెంగళూరును భారత సిలిక్యాన్ వ్యాలీగా ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేశారు. కర్ణాటకలోని మండ్య జిల్లా సోమనహళ్లిలో 1932 మే 1న సోమనహళ్లి మల్లయ్య కృష్ణ జన్మించారు. 1962లో తొలిసారి ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మద్దూర్ నియోజకవర్గం నుంచి గెలుపొంది 30 ఏళ్లకే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ప్రజా సోషలిస్ట్ పార్టీలో పనిచేసి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు.
ఆయన కర్ణాటక సీఎంగా ఉన్నప్పుడే పలు అంతర్జాతీయ సంస్థలు బెంగళూరులో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. అక్టోబరు 11, 1999 నుంచి మే 28, 2004 వరకూ కర్ణాటక సీఎంగా కొనసాగారు. 1962లో అమెరికా నుంచి వచ్చి... కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.. ఆరు దశాబ్దాల పాటు ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి గుర్తింపు పొందారు. యూపీఏ-2 హయాంలో 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు 2004 నుంచి 2008 వరకూ మహారాష్ట్ర గవర్నర్‌గా ఆయన సేవలందించారు. అయితే, 2017లో కాంగ్రెస్‌తో ఉన్న దాదాపు 50 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికి బీజేపీలో చేరారు. గతేడాది క్రియాశీల రాజకీయాల నుంచి ఈ సీనియర్ నేత వైదొలిగారు. రాజకీయాల్లో ఆయన చేసిన సేవలకుగానూ గతేాడాది కేంద్ర ప్రభుత్వం.. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
ఎస్ఎం కృష్ణ సీఎంగా ఉన్నప్పుడే పలు సంక్షోభాలు జరిగాయి. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌కు కిల్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేశారు. ఆందోళనలు, నిరసనలు, అభిమానుల ఆత్మహత్యలతో 108 రోజుల పాటు కర్ణాటక అట్టుడికింది. కావేరీ జలాలపై కూడా జనాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఐతే.. 2024 ఏప్రిల్ 29న ఎస్ఎం కృష్ణ తీవ్ర శ్వాసకోస ఇన్ఫెక్షన్‌కు గురికావడంతో బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో కుటుంబసభ్యులు చేర్పించారు. ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com