RBI : ప్రకృతి విపత్తు వస్తే అడగకపోయినా బ్యాంకులు సాయం.. జులై 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

RBI : రుణగ్రహీతలకు భారత రిజర్వ్ బ్యాంక్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆర్థికంగా చితికిపోయే సామాన్యులను ఆదుకునేందుకు ఆర్‌బీఐ తన నిబంధనల్లో విప్లవాత్మక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఏదైనా విపత్తు వస్తే బ్యాంకుల చుట్టూ తిరిగి ఉపశమనం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం లేదు. బ్యాంకులు స్వచ్ఛందంగానే రంగంలోకి దిగి మీకు ఊరట కలిగించేలా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కస్టమర్లు ఇబ్బంది పడకూడదని ఆర్‌బీఐ ఈ కొత్త నిబంధనలను రూపొందించింది. జులై 1, 2026 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం.. వరదలు, భూకంపాలు వంటి విపత్తులు సంభవించిన ప్రాంతాల్లో బ్యాంకులు కస్టమర్ల దరఖాస్తుల కోసం వేచి చూడకూడదు. అర్హులైన ప్రతి కస్టమర్‌కు బ్యాంకులు తమంతట తామే ఉపశమన పథకాలను వర్తింపజేయాలి. ఒకవేళ ఏ కస్టమరైనా ఈ సాయం వద్దనుకుంటే.. విపత్తు ప్రకటించిన 135 రోజులలోపు ఆ పథకం నుంచి తప్పుకోవచ్చు.
సాధారణంగా లోన్లు సరిగ్గా కట్టకపోతే ఆ అకౌంట్లను ఎన్పీఏగా మారుస్తారు. అయితే విపత్తుల కారణంగా అకౌంట్లు దెబ్బతింటే, ఆర్‌బీఐ కొత్త వెసులుబాటు కల్పించింది. విపత్తు తర్వాత ఎన్పీఏగా మారిన అకౌంట్లను, రిలీఫ్ ప్లాన్ అమలు చేసిన తర్వాత మళ్ళీ స్టాండర్డ్ కేటగిరీలోకి మార్చవచ్చు. అంటే మళ్ళీ ఆ ఖాతాదారుడికి బ్యాంకింగ్ సేవలు సాధారణంగా అందుతాయి. అయితే దీని కోసం బ్యాంకులు అదనంగా 5 శాతం నిధులను భద్రత కోసం కేటాయించాల్సి ఉంటుంది.
విపత్తుల సమయంలో ప్రజలకు నగదు ఇబ్బంది కలగకుండా ఆర్‌బీఐ కఠిన ఆదేశాలు ఇచ్చింది. మొబైల్ బ్యాంకింగ్ వ్యాన్లు, శాటిలైట్ ఆఫీసులు లేదా తాత్కాలిక ఎక్స్‌టెన్షన్ కౌంటర్ల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించాలి. ముఖ్యంగా ఏటీఎంలను వీలైనంత త్వరగా పునరుద్ధరించి, తగినంత నగదు అందుబాటులో ఉంచాలి. అంతేకాకుండా, విపత్తు బాధితులకు ఉపశమనం కలిగించేలా ఒక ఏడాది పాటు బ్యాంకు ఛార్జీలను తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేసే అధికారాన్ని కూడా బ్యాంకులకు ఇచ్చింది.
ఈ కొత్త నిబంధనలు కేవలం ప్రభుత్వ బ్యాంకులకు మాత్రమే కాదు.. కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ వంటి అన్ని రకాల ఆర్థిక సంస్థలకు వర్తిస్తాయి. అయితే, ఈ వెసులుబాటు కేవలం విపత్తుకు ముందు క్లీన్ రికార్డ్ ఉన్న అకౌంట్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే లోన్ చెల్లింపులో 30 రోజుల కంటే ఎక్కువ జాప్యం లేని అకౌంట్లను మాత్రమే బ్యాంకులు ఆదుకుంటాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
